నెల్లిమర్లలో జరిగిన టిడిపి-జనసేన ఉమ్మడి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్….జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సైకో పాత్ మాత్రమే కాదని సోషియో పాత్ కూడా అని, ఎవరు నవ్వినా తెల్ల బట్టలు వేసుకున్నా, సంతోషంగా ఉన్నా సహించలేరని షాకింగ్ కామెంట్స్ చేశారు. యువత, మహిళలు ప్రతి ఒక్కరిని జగన్ మోసం చేశారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేకే కూటమిలా ఏర్పడ్డామని అన్నారు. జగన్ గద్దె దించకపోతే తనకు చంద్రబాబుకు ఏ రాజకీయ నాయకుడికి నష్టం ఏమీ ఉండకపోవచ్చని, ప్రజలకు మాత్రం నష్టం కలుగుతుందని అందుకే పొత్తు పెట్టుకున్నానని పవన్ అన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలని, ఈ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆకాంక్షించారు. రామతీర్థం క్షేత్రంలో రాముడి తల తీసేయడం చూసిన తర్వాత ఎంతో బాధ కలిగిందని గుర్తు చేసుకున్నారు. అటువంటి దోషులపై ఒక చర్య కూడా తీసుకోలేదని మతకలహాలు వస్తే అధికారంలో ఉండొచ్చని జగన్ అనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలపై ఒక్క దాడి కూడా జరగలేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 240 ఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏపీలో బలమైన లా అండ్ ఆర్డర్ తీసుకు వస్తుందని అన్నారు. ఆ రోజు అమరావతికి 35,000 ఎకరాలు కాదు 55,000 ఎకరాలు కావాలన్న జగన్ ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడని ఎద్దేవా చేశారు. అయినా ఈ రోజుకీ ఏపీకి రాజధాని లేదని గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులను జీఎంఆర్ సంస్థకు చంద్రబాబు అప్పగించారని, కానీ, రివర్స్ టెండర్ అంటూ అదే జిఎంఆర్ సంస్థకు తిరిగి కాంట్రాక్ట్ జగన్ ఇచ్చారని గుర్తు చేశారు. చాణక్యచంద్రగుప్తుల హయాంలో నవనందులు అని తలతిక్క పనులు చేసే వాళ్ళు ఉండేవారని, వారిని గద్దించేందుకు చాణక్య చంద్రగుప్త వ్యూహం అమలు చేశారని, అదే వ్యూహం జగన్ ను గద్దె దించేందుకు పన్నాల్సిందేనని చెప్పారు.
జగన్ కు చిన్న గులకరాయ తగిలితే రాష్ట్రానికి దెబ్బ తగిలినట్టుగా ఫీలయ్యారని, హంగామా చేశారని ఎద్దేవా చేశారు. 65 కోట్లు ట్యాక్స్ కట్టే తనకు రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2000 సంవత్సరంలోనే విజన్ 2020 అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని, జగన్ లా ఆయనకు ఆశలు ఉంటే ఈరోజు ఆయన ఎన్ని లక్షల కోట్లు సంపాదించి ఉండేవారని అన్నారు.
అంతకుముందు కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ డప్పుల శబ్దానికి పవన్ వారాహి వాహనంపై నుంచే చిన్నగా డ్యాన్స్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.