వైసీపీ అధినేత, సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆయన ప్రజల జగన్ కాదు.. పరదాల జగన్“ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య ఉండాల్సిన ముఖ్యమంత్రి పరదాల చాటున తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తీసుకురావటానికి ఢిల్లీ వెళ్లటం లేదని.. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డిని కాపాడటానికే వెళ్తున్నారని ఆరోపించారు. నాలుగోరోజు
సీబీఐ కేసుల నుంచి, విచారణ నుంచి అవినాష్‌రెడ్డిని కాపాడేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నాలుగో రోజు పలమనేరు నియోజకవర్గంలో నడిచారు. నియోజకవర్గంలోని గాంధారమాకులపల్లెలో ఏర్పాటు చేసిన వడ్డెర సంఘం సమావేశం, తెలుగు యువత ఏర్పాటు చేసిన ‘హలో లోకేష్’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను యువత వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు కావటంతో కళాశాలలు వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నాయని వాపోయారు.
చదువుకున్నా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామని.. భవిష్యత్‌కు మార్గం చూపెట్టాలని లోకేష్‌ను కోరారు. దీనిపై స్పందించిన లోకేష్ అధికారంలోకి రాగానే ఏటా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కంపెనీలను తీసుకువచ్చి సూమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ గేర్ వేసి.. వెనక్కి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే యువతపై కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారన్నారు. యువత పోరాటానికి మద్దతుగా నిలబడేందుకే యువగళం కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. ప్రజల మధ్య ఉండాల్సిన ముఖ్యమంత్రి పరదాల చాటున తిరుగుతున్నారని లోకేష్ దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఏపీకి రాజధాని ఉండాలన్న ముఖ్యమంత్రి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు.
దామాషా పద్దతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే అభివృద్ది వికేంద్రీకరణ అని లోకేష్ అన్నారు. జగన్ మాత్రం ఆచరణకు సాధ్యం కాని మూడు రాజధానులు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. దావోస్ పర్యటనకు వెళ్లి పరిశ్రమలు తీసుకురాలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ అని ఎండగట్టారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ ఈ రాష్ట్రానికి అవసరమా అని దుయ్యబట్టారు. దావోస్‌లో చలి ఎక్కువగా ఉందని వెళ్లలేదని మంత్రి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.