ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో అమరావతి రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. కొద్ది రోజుల నుంచి వస్తున్న ఊహగానాల ప్రకారమే జగన్ అమరావతిపై మరోసారి విషం చిమ్మారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్…ఒకే రాజధాని అమరావతి సాధ్యమా అంటూ విపక్షాలను ప్రశ్నించారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అందుకే మూడు రాజధానులను తీసుకొచ్చామని పాత పాటే పాడారు. అమరావతిని అభివృద్ధి చేయలేమని, అటువంటి ప్రాంతం కోసం ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అమరావతి ఉద్యమాన్ని చులకన చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కట్టని రాజధాని, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమం ఏమిటని షాకింగ్ కామెంట్స్ చేశారు. అమరావతి నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు.
ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు గానీ, నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలోగానీ, విభజన హామీల విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతున్నప్పుడుగానీ చంద్రబాబు ఒక్క రోజు కూడా ఉద్యమం చేయలేదని జగన్ అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం తాము ప్రయత్నిస్తున్నామని, అందుకు వ్యతిరేకంగా వెయ్యి రోజులుగా కృత్రిమ రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారంటూ రైతుల ఉద్యమాన్ని అవహేళన చేశారు.
చంద్రబాబుపై 420 కేసు పెట్టాలంటూ జగన్ నిండు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం అమరావతి లేదని, కేవలం ఓ సామాజిక వర్గం, పెత్తందారుల స్వలాభం, అభివృద్ధి కోసమే అమరావతి రాజధాని ఉందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాల్సిన ఉద్దేశం, అవసరం తమకు లేవని చెప్పారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని అవమానించేలా జగన్ చేసిన కామెంట్లుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments 1