ఏపీ అధికార పార్టీ వైసీపీలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయా? అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కే నాయకులపై వ్యతిరేకత చాపకింద నీరులా పెరుగుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఈ విషయం పార్టీలోనూ అంతర్గత చర్చకు దారితీసింది. అయితే.. దీనిని సీరియస్గా తీసుకునే నాయకులు కనిపించకపోవడం మరో దురదృష్టకర పరిణామమని అంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం దక్కించుకున్న వైసీపీ.. వచ్చే ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది.
అయితే.. వలంటీర్ వ్యవస్థ కావొచ్చు.. స్పందన వంటి కార్యక్రమాలు కావొచ్చు.. ఇవి ప్రజలకు మంచి చేసి నా.. పార్టీతరఫున విజయందక్కించుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో పెద్ద గుదిబండలుగా మారా యి. ఈ వ్యవస్థల కారణంగా.. ప్రజలకు నేతలకు మధ్య ఉండాల్సిన సంబంధాలు దాదాపు తెగిపోయాయి.
దీనికితోడు.. గత ఎన్నికల సమయంలో భారీగా నిధులు ఖర్చు చేసి విజయం దక్కించుకున్న నాయకుల కు.. తర్వాత.. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు అందకపోవడం.. నేరుగా ప్రజలకు అందించే కార్యక్ర మాలు చేపట్టడం కూడా ఆర్థికంగా నాయకులకు ఇరకాటంగా మారింది.
దీంతో ఎక్కడికక్కడ.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక అక్రమా ల్లో నేతల పేర్లు బాహాటంగా వినిపిస్తున్నాయి. మద్యం విక్రయాలు, బెల్టు షాపుల్లోనూ అధికార పార్టీ నాయ కుల పేర్లు వినిపిస్తుండడం వైసీపీకి ఇబ్బందిగా మారాయనడంలో సందేహం లేదు.
పైకి మాత్రం ప్రజల కు సంక్షేమం అందిస్తున్నామని, ప్రజా నాడి తమకే అనుకూలంగా ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం.. నేతలపై వ్యతిరేకత పెరుగుతోంది. నాయకులు సొంత కార్యక్రమాల్లో దూకుడుగా ఉండడం.. సంపాదనపైనే దృష్టి పెట్టడం.. దీనికి అక్రమ మార్గాలను అన్వేషించడం వంటివి.. పార్టీకి ఇబ్బందిగా మారాయి.
మరోవైపు.. మంత్రులకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఎవరూ ఎవరినీ లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. పోనీ అధిష్టానమైనా ఆయా పరిస్థితిని సరిదిద్దే పరిస్థితి ఉందా? అంటే.. ప్రస్తుతం ఇతరత్రా సమస్యలతోనే తీరుబడి లేకుండా ఉంది.
ఇదే అదునుగా క్షేత్రస్థాయిలో నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరో రెండున్నరేళ్ల సమయం ఉంది కనుక.. తమకు తిరుగులేదని భావిస్తున్నారో.. లేదా.. అతి విశ్వాసమో తెలియదు కానీ.. వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది.
మరోవైపు.. గత రెండున్నరేళ్లలో పడిపోయిందని అనుకున్న టీడీపీ గ్రాఫ్ పుంజుకోవడం గమనార్హం. గడిచిన ఆరు మాసాల్లో టీడీపీ పుంజుకుందన్నది వాస్తవం. కారణాలు ఏవైనా కూడా.. టీడీపీ పుంజుకుంది. ప్రజల్లో ఉంటూ.. ప్రభుత్వంపై చేస్తున్న పోరాటానికి బాగానే స్పందన కనిపిస్తోంది. పైగా మొన్న ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓటింగ్ 40 శాతం. ఇంకా కావాల్సింది కేవలం 6 శాతమే.
ఇదే పరిస్థితి కొనసాగితే.. టీడీపీ మళ్లీ యథాతథ పరిస్థితికి వచ్చే అవకాశం మెండుగానే ఉంది. మరి దీనిని గమనించైనా.. వైసీపీలో మార్పులు వస్తాయో.. నాయకులు మారతారో.. లేదో చూడాలి. ఏదేమైనా.. ప్రస్తుతం మాత్రం వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయనేది మాత్రం వాస్తవం అంటున్నారు పరిశీలకులు.