ఇటీవల సీఎం జగన్ తో సినీ పెద్దల భేటీ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ భేటీకి మోహన్ బాబుకు ఆహ్వానం అందలేదని, అందుకే పేర్ని నాని స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారని టాక్ వచ్చింది. చిరంజీవి వచ్చారు కాబట్టే మోహన్ బాబు రాలేదని కూడా ప్రచారం జరిగింది. అయితే, తమకు ఆహ్వానం అందలేదని, అందుకే రాలేదని, ఈ విషయాన్ని జగన్ కు చెప్పాలని మోహన్ బాబు, విష్ణులు నానికి చెప్పారు. ఈ క్రమంలోనే నేడు విష్ణును లంచ్ మీటింగ్ కు ఆహ్వానించారు జగన్.
ఈ నేపథ్యంలోనే జగన్ తో భేటీ అనంతరం విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే నాన్నకి ఆహ్వానం అందకుండా చేశారని, ఇపుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. సినీపరిశ్రమ అంతా ఒక కుటుంబం లాంటిదేనని, తామంతా కుటుంబసభ్యులమని చెప్పారు. సీఎంతో భేటీలో చాలా అంశాలు ప్రస్తావనకి వచ్చాయని, మరోసారి ఆ విషయం గురించి మాట్లాడతానని అన్నారు. జగన్ మా బావ అవుతారని, కానీ, ఆయన అన్న అని తనను పిలుస్తారని చెప్పారు.
గతంలో ఆయనతో భేటీ అయిన మాదిరిగానే ఇప్పుడు కూడా అయ్యానని, కానీ, టాలీవుడ్ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పారు. మరోవైపు, విష్ణు వాహనాన్ని నేరుగా లోపలకు పంపించిన భద్రతా సిబ్బంది… ఇటీవల చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరుల హనాలను గేటు దగ్గరే ఆపేయడం విశేషం. గేటు దగ్గర్నుంచి చిరుతోపాటు వారంతా నడుచుకుంటూ లోపలకు వెళ్లగా..విష్ణు మాత్రం వాహనంలో నేరుగా లోపలకు వెళ్లడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జగన్ దగ్గర చిరంజీవి కన్నా మోహన్ బాబు, విష్ణులకే వెయిట్ ఎక్కువ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.