ఏపీలో రెండోసారి ఎలాగైనా గెలవాలి. అధికారాన్ని చేతుల్లో నుంచి జారనివ్వకూడదు. సభలు, సమావేశాలు, బస్సుయాత్రలు చేసినా సిద్ధమంటూ జనాల్లోకి వెళ్లినా ఆశించిన ఫలితం రాలేదు. అయిదేళ్ల అరాచక పాలన చూసిన జనాలు జగన్ ను నమ్మడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి కనిపిస్తోంది. కళ్లముందే కూటమి విజయమూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం జగన్ ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారనే టాక్ ఉంది. చివరికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సూచనలనూ జగన్ పాటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ చెప్పినట్లు జగన్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు భంగపాటు తప్పలేదు. అప్పుడు తాము చేసిన తప్పులు ఇప్పుడు జగన్ చేయకుండా కేసీఆర్ సూచనలు ఇస్తున్నారని తెలిసిందే. అందుకే పెద్ద సంఖ్యలో జగన్ అభ్యర్థులను మార్చారని టాక్. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పుంజుకోకుండా, టీడీపీ అధినేత చంద్రబాబుకూ చెక్ పెట్టేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జగన్ టార్గెట్ చేశారని అంటున్నారు. దీని వెనుక కూడా కేసీఆర్ ఉన్నారనే చెబుతున్నారు. ఓ వైపు ఏపీలో జగన్ మళ్లీ గెలుస్తారనే కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు తనకు పూర్తి సమాచారం ఉందన్నారు.
రాజకీయాల్లో అనుభవం కలిగిన నేత, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ లాంటి నాయకుడు ఓ మాట చెబితే అది జనాల్లోకి వెళ్తోంది. అందుకే జగన్ మళ్లీ గెలుస్తారని కేసీఆర్ చెబుతున్నారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కేసీఆర్ మాటలను సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్ విమర్శలు చేస్తున్నారు. బాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని, రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషేనని, తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో కాపురం చేస్తారని జగన్ విమర్శించారు. అయితే ఈ జగన్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ డైరెక్షన్ ఉందని సమాచారం. దీనిపై రేవంత్ కూడా దీటుగా స్పందించారు. జగన్ మాటలను సొంత చెల్లి, తల్లీ నమ్మడం లేదని అన్నారు.