‘‘జగన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.. అది గ్రహించే మొన్న సొంతూరు పులివెందులలో కూడా పరదాలు, ఐరన్ బారికేడ్ల వెనుక పర్యటించారు.. పోలీసులను అడ్డుపెట్టుకుని కాదు.. దమ్ముంటే నేరుగా ప్రజల్లోకి వెళ్లాలి…అప్పుడే అసలు విషయం తెలుస్తుంది….నేనెప్పుడూ పరదాల మాటున పర్యటించలేదు. నేరుగా జనంలోనే ఉంటాను’’…సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తాజా కామెంట్లు ఇవి.
చంద్రబాబు చెప్పారని కాదు..ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని అంతకన్నా కాదు..జగన్ కు జనం అంటే భయం అన్నది నిష్టూరం లాంటి నిజం. గతంలో రాయలసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్…వారిని అంటరాని వారిని చూసినట్లు దూరంగా నిలబడి మాట్లాడి రావడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఇక, జగన్ తాడేపల్లి ప్యాలెస్ దగ్గరైతే ప్రధాని మోదీ నివాసానికన్నా ఎక్కువ భద్రత ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి జగన్ వెళుతున్న దారిలో కూడా బారికేడ్లు పెట్టి జనాన్ని నిలిపివేస్తున్న పరిస్థితి.
ఇక, ఈ మధ్య గడప గడపకు అంటూ జనం దగ్గరకు వెళుతున్న వైసీపీ నేతలను జనం గల్లాపట్టి నిలదీస్తున్నారు. దీంతో, జగన్ మరింత అభద్రతకు లోనయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి జనం మెచ్చిన…జనానికి నచ్చిన నాయకుడైతే జనంలోనే జనంతోనే ఉండాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నా…అధికార పక్ష నేతగా ఉన్నా…ఒకేలా జనం మధ్యలో తిరిగారు. తిత్లీ వంటి భీకర తుపాను విశాఖను కుదిపేస్తుంటే అక్కడే మకాం వేసి బాధితులకు భరోసానిచ్చారు.
కానీ, జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఏరియల్ సర్వేలతో సరిపెట్టేసి…తుపాను తగ్గిన తర్వాత భౌతిక దూరం పాటిస్తూ మొక్కుబడిగా పరామర్శించి వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జనానికి ముద్దులు పెట్టేంత దగ్గరకు వెళ్లిన జగన్…సీఎం అయిన తర్వాత మాత్రం గుద్దులు గుద్దినా అందనంత దూరమయ్యారనే చెప్పాలి. ప్రజల్లో చంద్రబాబు..పరదాల్లో జగన్ అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.