- హుండీ ఆదాయంపై జగన్ సర్కారు కన్ను
- అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
సంక్షేమం పేరిట ఓటుబ్యాంకు పెంచుకోవడానికి, పనులు చేసినా చేయకున్నా అస్మదీయులైన కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ప్రభుత్వ ఆదాయమంతా సరిపోతోంది. అందినకాడికి అప్పులు చేస్తూ.. ఆస్తులు తనఖా పెడుతూ.. అతికష్టమ్మీద బండి లాగిస్తున్న సర్కారు.. ఇప్పుడు తిరుమల శ్రీవేంకటేశ్వరుడి హుండీపై కన్నేసింది.
కరోనా కారణంగా భక్తుల రాకను నియంత్రించినా ఇబ్బడిముబ్బడిగా స్వామికి ఆదాయం వస్తుండడంతో.. దీనినెందుకు వదిలిపెట్టాలా అని ఆలోచించింది. అంతే.. ఏటా రూ.50కోట్లను తనకివ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టీటీడీ) ఆదేశించింది. ఇందుకోసం ఏకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి కనీసం చర్చయినా లేకుండానే ఆమోదించింది.
అవసరమైతే దేవదాయ శాఖకు, అర్చకుల సంక్షేమానికి తానే నిధులిస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసి.. ఇప్పుడు కనీసం ఆలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా వేతనాలివ్వలేక.. పక్కచూపులు చూస్తోంది. ప్రస్తుతం టీటీడీ నుంచి ఏటా రూ.2.25 కోట్లు దేవాదాయ శాఖకు వస్తోంది. దానికి రెట్టింపో.. 5 కోట్లో.. పోనీ పది కోట్లో అడిగారంటే అర్థముంది. కానీ ప్రతి ఏడాదీ రూ.50 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. అంతేగాక ప్రతి ఐదేళ్లకోసారి 10 శాతం నిధులు పెంచాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ దేవదాయ, ధర్మాదాయ చట్టాన్ని సవరించి ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం.. దానికి సంబంధించిన బిల్లును శాసనసభ ముందుంచి ఆమోదించుకుంది.
50 కోట్లలో కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కింద రూ.40 కోట్లు, ఎండోమెంట్ అడ్మినిస్ర్టేటివ్ ఫండ్ (ఈఏఎఫ్) కింద రూ.5 కోట్లు, అర్చక సంక్షేమ నిధికి మరో రూ.5 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేవాదాయ శాఖకు ఏ ప్రభుత్వంలోనూ నిధులు మంజూరు చేయరు. రాష్ట్రంలోని ఆలయాల నుంచి సీజీఎఫ్, ఈఏఎఫ్, వివిధ రూపాల్లో నిధులు సేకరించి.. ఉద్యోగుల వేతనాలకు, ఆలయాల పునరుద్ధరణ పనుల వరకు వాడుతుంటారు.
అన్ని ఆలయాల తరహాలోనే టీటీడీ కూడా కొంత శాతం నిధులివ్వాలని 1987లో చట్టం చేసినప్పుడు ప్రతిపాదించారు. కానీ టీటీడీకి వచ్చే భారీ ఆదాయం నుంచి కొంత నిధులు అంటే సాధ్యం కాదని, ఫిక్స్‌డ్‌గా కొంత ఇస్తామని అప్పట్లో ఏటా రూ.50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.1.25 కోట్లకు పెంచారు. మరోసారి రూ.2.25 కోట్లకు పెంచారు. చాలాకాలం నుంచి ఆ మేరకే టీటీడీ దేవదాయ శాఖకు నిధులు ఇస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా టీటీడీ ఇచ్చే నిధులను పెంచాలని ప్రతిపాదించారు. కానీ అందుకు టీటీడీ ఆడిట్ విభాగం అభ్యంతరం తెలుపడంతో ఆ ప్రతిపాదన అక్కడితోనే ఆగిపోయింది.
ఒత్తిడి చేస్తే లేనిపోని వివాదాలు తలెత్తుతాయని టీడీపీ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వాటిని లెక్కచేయలేదు. ఆడిట్ విభాగం అభ్యంతరాలను, ఇతరత్రా విమర్శలను లక్ష్యపెట్టకుండా ఒకేసారి భారీగా నిధులు లాగాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రభుత్వం ప్రతిపాదించడం, దానికి టీటీడీ సమ్మతి తెలియజేయడం చకచకా జరిగిపోయాయి. ఎందుకంటే ఇక్కడ అబ్బాయి (సీఎం జగన్), అక్కడ బాబాయి (టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆడిట్ విభాగం నోరెత్తితే నలగబొడుస్తామని బెదిరిస్తారు. హిందూ సంఘాలు కూడా ఎందుకనో దీనిపై స్పందించలేదు. వాటికి అందాల్సిన కానుకలు అందాయేమో మరి!
టీటీడీయే ఎందుకు ఇవ్వాలి?
దేవదాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల నుంచీ నిధులు వసూలు చేస్తోంది. వాటికొచ్చే ఆదాయంలో సీజీఎఫ్ కింద 9 శాతం, ఈఏఎఫ్ కింద 8 శాతం, అర్చక సంక్షేమ నిధికి 3 శాతం నిధులను తీసుకుంటోంది. పెద్ద ఆలయాల నుంచే ఈ కాంపోనెంట్ల కింద ఆ శాఖకు భారీగా నిధులు వస్తున్నాయి. ఇప్పుడు టీటీడీ కూడా భారీగా ఇవ్వాల్సిందేనని జగన్ ప్రభుత్వం పట్టుబట్టింది. వాస్తవానికి టీటీడీ నేరుగా దేవదాయ శాఖకు ఇచ్చే నిధులు తక్కువే అయినా సొంతంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
వివిధ ఆలయాల నుంచి వచ్చే నిధులతో దేవదాయ శాఖ కూడా అవే పనులు చేస్తోంది. అయినా టీటీడీని ఇంకా ఎందుకు పిండాలని అనుకుంటోందో అధికార వర్గాలకు కూడా అంతుపట్టడం లేదు.
కాగా.. అర్చక సంక్షేమ నిధికి ఇచ్చే రూ.5 కోట్లను బ్రాహ్మణ కార్పొరేషన్‌కు మళ్లించి.. వాటిని అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర లాంటి పథకాలకు వినియోగించనున్నట్లు తెలిసింది. అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వమే నిధులు ఇస్తుందంటూ వైసీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్లో రూ.234 కోట్లు కేటాయించింది. కానీ అందులో పైసా కూడా విడుదల చేయలేదు.
ఇప్పుడు టీటీడీ నిధులు ఇవ్వాలనడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవదాయ శాఖ నిధులు, ప్రభుత్వ నిధులు వేర్వేరు అయినప్పటికీ అన్నిటినీ ప్రభుత్వ ఖాతాలోనే వేస్తున్నారు. చివరకు ధూపదీప నైవేద్యాలకు కూడా ప్రభుత్వం సొంత నిధులివ్వకుండా.. ఆలయాల నుంచి వచ్చేవాటినే మళ్లిస్తోంది.