“అమ్మ సన్నిధిలోనూ రాజకీయాలెందుకు సర్!“-అని బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దసరా నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు 9 రోజుల పాటు భక్తులను కటాక్షించనుంది. ఈ క్రమంలో శుక్రవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని(అమ్మవారి జన్మనక్షత్రం) దుర్గమ్మ సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.
ఏటీ మూలానక్షత్రం రోజు ప్రభుత్వం(ఎవరు అధికారంలో ఉన్నా) తరఫున ముఖ్యమంత్రి స్వయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండేలా చూడాలని కనకదుర్గమ్మను వేడుకుంటారు. ఈ ఏడాది సీఎం జగన్ స్వయంగా దుర్గగుడికి వచ్చారు. ఆయన కు ఆలయ పాలకమండలి చైర్మన్, అధికారులు, ఈవో, పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం..పూర్ణకుంభ స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించారు. అయితే.. ఈ సమయంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అధికారికంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం కాబట్టి.. మౌనంగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.
కానీ, సీఎం జగన్ మాత్రం కొండపైకి అడుగు పెడుతూనే.. క్యూలైన్లలో కిక్కిరిసి ఉన్న వారిని(చెమటలు పట్టి వారి తిప్పలు వారు పడుతున్నారు) చూసి దణ్ణాలు పెడుతూ.. ముందుకు సాగారు. అంతేకాదు.. దారిలో ఒకరిద్దరు చిన్నారుల తలలు నిమిరి ముద్దాడారు. వృద్ధులను పలకరించారు. ఇలా.. ఆసాంతం ఆయన రాజకీయ పర్యటనను తలపించేలా ఇంద్రకీలాద్రి పర్యటనను మార్చేశారనే విమర్శలు భక్తుల నుంచి వినిపించాయి. ఆఖరికి గర్భగుడికి వెళ్లే వరకు కూడా సీఎం జగన్ భక్తులకు దణ్ణాలు పెడుతూనే ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. దీనిని గమనించిన భక్తులు అమ్మ సన్నిధిలోనూ రాజకీయాలు ఎందుకు సర్ అని కామెంట్టు చేశారు.