తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అంతకు ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు ఉచిత బస్సు పథకం హామీని ఇచ్చి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు బస్సులలో ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇక, తాజాగా తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి మంచి ఆదరణ వస్తోంది.
ఆ పథకాన్ని చూసే కాంగ్రెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టడం వంటి కారణాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కూడా సంక్రాంతి తర్వాత ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని కొన్ని జిల్లాలలో అమలు చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారంపై చంద్రబాబు స్పందించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తాను ప్రకటించిన ఉచిత బస్సు హామీని తమ కంటే ముందే అమలు చేయాలని భావిస్తున్నారని చంద్రబాబు చురకలంటించారు.
జగన్ ఎన్ని బూటకపు హామీలిచ్చినా రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమ గీతం పాడుతారని జోస్యం చెప్పారు.