డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో రైతులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై చంద్రబాబు మండిపడ్డారు. 6 నెలల్లో జగన్ ప్రభుత్వం పడిపోతుందని. తాను ఏడిద రాగానే వర్షం పడడం శుభసూచికం అని అన్నారు. కరోనా సమయంలోనూ రైతులు వ్యవసాయం ఆపలేదని కొనియాడారు. కాటన్ మహానీయుడు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారని, పోలవరం పూర్తయ్యి ఉంటే సాగునీరు, తాగునీరు పూర్తిస్థాయిలో అందేవని అన్నారు.
ఏపీలో జగన్ రివర్స్ పాలన చేస్తున్నాడని, జగన్ అసమర్థ పాలన రైతులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని జగన్ నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మార్చేశాడని దుయ్యబట్టారు. మళ్లీ ప్రజలు ఓటు వేస్తే తాము అధికారంలోకి వస్తామని, దేశంలో రైతులపై సరాసరి అప్పు 75 వేలు అయితే.. ఏపీలో మాత్రం 2.40 లక్షలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా కేంద్రాలు రైతులపాలిట శాపంగా మారాయని, జగన్ వల్ల ఒక్క రైతూ ఆనందంగా లేడని చంద్రబాబు అన్నారు. జగన్ పిచ్చి నిర్ణయాలు అభివృద్ధికి ఆటంకం అని, ధాన్యం కొనుగోలు చేయడం చేతగాని జగన్ 3 రాజధానులు కడతాడంట అని ఎద్దేవా చేశారు. కోనసీమలో కొబ్బరికి జగన్ మద్దతు ధర ఇవ్వడం లేదని, ఆక్వా సాగును నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి పంట పండిస్తున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచనని అన్నారు. మందుబాబులను జగన్ మోసం చేశాడని దుయ్యబట్టారు.