జీవితంలో ఏ వ్యక్తి అయినా.. ఒక్కసారే వివాహం చేసుకోవాలని.. జీవితాంతం.. ఆ భాగస్వామితోనే ఉండాలని.. అనుకుంటారు. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పలు కారణాలు.. వివిధ సమస్యల నేపథ్యంలో వివాహాలు విఫలమైన నేపథ్యంలో మరో పెళ్లి అనివార్యంగా మారుతుంటుంది. అయితే.. దీనిని తప్పని.. `పెళ్లిళ్లు` చేసుకోవడం సరికాదనేది వైసీపీ అధినేత, సీఎం జగన్ చెప్పేమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసుకున్న వివాహాలపై తరచుగా ఆయన విమర్శలు, లోతైన కామెంట్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ ఏ సభ పెట్టినా.. జగన్ నోటి నుంచి పవన్ పెళ్లిళ్ల మాటే వినిపిస్తోంది.
ఈ విమర్శలపై కొన్నాళ్ల పాటు పవన్ కూడా స్పందించారు. “ఎవరూ కావాలని ఇన్ని పెళ్లిళ్లు చేసుకోరు. పరిస్థితుల ప్రభావం. ఏం జరిగిందో.. ఏమో.. నా జీవితంలో మార్పులు జరిగాయి. ఒకరికి మించి పెళ్లిళ్లు జరిగాయి. ఇది నా వ్యక్తిగత వ్యవహారం“ అని పవన్ చెప్పారు. అయినప్పటికీ.. ఈ విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తూనే ఉంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పవన్ను మానసికంగా బద్నాం చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఇదే వైసీపీకి చెందిన నాయకుడు, ఈ ఏడాది ఎమ్మెల్సీ అయిన.. కృష్నాజిల్లాకు చెందిన జయ మంగళ వెంకట రమణ తాజాగా మూడో పెళ్లి చేసుకున్నారు.
కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే అయిన జయమంగళ వెంకటరమణ.. తాజాగా సోమవారం కైకలూరులోని రిజిస్ట్రార్ ఆఫీస్లో అటవీ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సుజాతను వివాహం చేసుకున్నారు. ఇది ఆయనకు మూడో పెళ్లి. సీనియర్ నాయకుడు అయిన జయమంగళకు రాజకీయాల్లోకి రాకముందే.. వివాహం జరిగింది. అయితే.. మొదటి భార్యకు పిల్లలు కలగలేదు. దీనికి తోడు అనారోగ్యంతో ఆమె చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏడేళ్ల కిందట సునీత అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు.
సునీత, జయమంగళ దంపతులకు ఇద్దరు పిల్లలను కూడా ఉన్నారు. అయితే.. ఆర్థిక, కుటుంబ తగాదాల నేపథ్యంలో సునీత నుంచి జయమంగళ వెంకటరమణ దూరంగా ఉంటున్నారు. విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సుజాతను వివాహం చేసుకోవడం గమనార్హం. సుజాతకు ఇది రెండో వివాహమని సమాచారం. అయితే.. రెండో భార్యతో విడాకులు తీసుకోకుండానే ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇదెలాఉన్నా.. వైసీపీ నాయకులు పవన్ను విమర్శించే పరిస్థితి లేకుండా పోయిందనే కామెంట్లు అయితే.. వినిపిస్తున్నాయి.