తెలుగోళ్లకు ఏదో శని పట్టిందండి.. లేకపోతే.. ఎంతో బాగుండేవాడు.. పుటుక్కున చనిపోవటం ఏమిటండి? కరోనాకు బలి కావాలంటే ఇప్పటివరకు చెప్పిన సైంటిఫిక్ థియరీలకు భిన్నంగా.. పెద్ద ఎత్తున మరణాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. నిజానికి శని తెలుగోళ్లకు మాత్రమే కాదు.. భారతీయులందరికి పట్టిందన్న వేదనే పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాకుంటే.. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున.. కేంద్రం చేసిన తప్పులు తమ వారికి శాపంగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందుకే ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉంటుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
ఇందులో మరో కోణాన్ని ఎత్తి చూపుతున్నారు. తమకు నచ్చని రాష్ట్రాలకు కేంద్రం సహాయ నిరాకరణ చేస్తుందన్న మాట కూడా ఈ మధ్యన వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. అంతకు మించిన నీచం మరొకటి ఉండదు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ.. మరికొన్ని సందర్భాల్లో పురాణాల్ని కోట్ చేస్తే.. కొన్ని ప్రత్యేక సందర్భాలకు కారణంగా.. అప్పటి గ్రహాల గమనం.. కొన్ని విచిత్రమైన కాంబినేషన్ల కారణంగా కొన్ని దారుణాలు చోటు చేసుకున్నట్లుగా అభివర్ణిస్తుంటారు.
అలాంటి విషయాల్లో అనుభవం ఉన్న వారు ఇప్పుడు.. గ్రహాల కక్ష్యను.. వారి భ్రమణాన్ని.. ఏమైనా.. కాంబినేషన్లు.. అంటే చాలా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉండేలా.. పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా? అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటారా? కేంద్రంలో మోడీ సర్కారు.. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్.. జగన్ ప్రభుత్వాలే ఇందుకు నిదర్శనం. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ముగ్గురు అధినేతల్ని అభిమానించేవారు.. ఆరాధించేవారు.. తమ వారు ఇంత మందిని కోల్పోతున్నా.. ఇప్పటికి తమ నేతల్ని అభిమానించటం.. ఆరాధించటం.. వారిని నెత్తిన పెట్టుకోవటం.. వారి నిర్ణయాల్ని తమ పిడివాదనతో సమర్థిస్తున్న తీరు చూస్తే.. జాలి పడటం మినహా మరింకేం చేయగలం?
ఓపక్క కరోనా కేసుల తీవ్రత భయంకరంగా పెరిగిపోతున్న వేళ.. మోడీ సర్కారు వాటి మీద కంటే కూడా బెంగాల్ కోటను ఎలా సొంతం చేసుకోవాలన్న దాని మీదనే ఫోకస్ పెట్టి.. ప్రజల ప్రాణాలు పోకుండా తీసుకోవాల్సిన కీలకమైన గోల్డెన్ టైంను మిస్ చేసుకున్నారు. సాగర్ ఉప ఎన్నికతో పాటు.. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడటంతో పాటు.. ఈటల లాంటి వారిపై వేటుకు అసలుసిసలు సమయం ఇదే అన్నట్లుగా వ్యవహరించి.. ఏం చేశారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే అర్థమవుతుంది. ఏపీ విషయానికి వస్తే.. తిరుపతి ఉప ఎన్నిక మీదా.. స్థానిక రాజకీయాల మీద.. విపత్తు వేళలోనూ.. సంక్షేమ పథకాల అమలు తప్పించి.. ప్రాణ వాయువు సప్లై మీదా ఫోకస్ పెట్టింది లేదు.
పిల్లల పరీక్షలు ఏదోలా జరిపించాలన్న తాపత్రయం తప్పించి.. అలా చేయటం ద్వారా లక్షలాది మందికి ముప్పు అన్నది మర్చిపోవటం.. కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత వెనక్కి తగ్గటం లాంటివి చూస్తే.. ప్రజారోగ్యం.. ప్రజల ప్రాణాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయం మీద వారికున్న అభిప్రాయం ఈ రోజున ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. అందుకే.. ఒకసారి గ్రహ కూటమిని ఒక్కసారి చెక్ చేసి.. ఏదైనా విశేషం ఉందేమో చెప్పి పుణ్యం కట్టుకోకూడదు. అదే జరిగితే.. మరింత మంచిది. ఎందుకంటే.. అంత పెద్ద గ్రహాలే కావాలని తమ మీద కుట్ర చేసినప్పుడు.. ఇలాంటి విపత్తు కాకుండా మరింకేం ఉంటుందని కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మొహమాటం లేకుండా చెప్పే వీలుంది. కాదంటారా?