జగన్ బర్త్ డేకు రూ.1000 కోట్ల జే ట్యాక్స్ వసూలు?


సాధారణంగా తమ ప్రియతమ రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఇక, ఆ పార్టీ అధినేత, అందులోను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తమ ప్రియతమ నేత బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇందుకుగాను, తమ తమ స్థాయిలను బట్టి పార్టీకి సంబంధించిన నేతలు ఖర్చుపెడుతుంటారు. కేక్ కటింగ్ లు, అన్నదానాలు, పాలాభిషేకాలు వగైరా వంటి కార్యక్రమాలకు అయ్యే ఖర్చంతా పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు చూసుకుంటుంటారు. అయితే, ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజుల వేడుకలు మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి...అయితే, ఆ వేడుకల కోసం ఖర్చు చేస్తున్న డబ్బు మాత్రం ఆ పార్టీ వారిది కాకపోవడమే విశేషం. జగన్ పుట్టిన రోజు వేడుకల కోసం ఛోటామోటా వ్యాపారులు మొదలు కార్పొరేట్ కంపెనీల వరకు అందరి దగ్గర నుంచి జే ట్యాక్స్ వసూలు చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏపీ మొత్తంగా జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు వ్యాపారుల నుంచి వైసీపీ కార్యకర్తలు దాదాపు రూ.1000 కోట్లు వసూలు చేశారని వదంతులు వినిపిస్తున్నాయి.

కరోనా దెబ్బకు ఏపీలో పలు వ్యాపారాలు దెబ్బతిన్న సందర్భంలో...ఈ పుట్టిన రోజు వేడుకలకు జే ట్యాక్స్ కట్టాల్సి రావడంతో వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. జగన్ బర్త్ డే కోసం ఏపీలో జె టాక్స్ వసూలు చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏకంగా సీఎం జగన్ కు లేఖ రాయడం కూడా ఈ వదంతులకు ఊతమిస్తోంది. చిరు వ్యాపారులకు రూ.5 వేలు...బడా వ్యాపారులకు రూ.లక్ష జే ట్యాక్స్ విధించారని పుకార్లు వస్తున్నాయి. తాను జగన్ జన్మదిన వేడుకలకు వ్యతిరేకం కాదంటోన్న రఘురామ....జె టాక్స్ వసూళ్లతో కొందరు పార్టీకి, సీఎంకు చెడ్డపేరు తెస్తున్నారని వాపోవడం విశేషం.

ఈ జే టాక్స్ వసూళ్లు ఆపివేయాలంటూ వైసీపీ నేతలకు సీఎం జగన్ సూచించాలని కూడా రఘురామ చెప్పడం విశేషం. అయితే, ఇవేమీ పట్టని వైసీపీ నేతలు కొందరు...ఆల్రెడీ వసూళ్లు చేసేశారని ప్రచారం జరుగుతోంది. కాకినాడలో 60 అడుగుల సీఎం జగన్ కటౌట్ ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు...రెండ్రోజుల ముందే బర్త్ డే వేడుకలు జరిపి అందరికంటే ముందే వార్తల్లో నిలిచారు. ఇక, జగన్ బర్త్ డే పురస్కరించుకొని విశాఖలో విజయసాయి రెడ్డి ఓ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ పేరుతో విశాఖలో రూ.100 కోట్ల జె టాక్స్ వసూలు చేశారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.

విశాఖలో ఫ్యాక్షనిస్టుల వసూళ్లు ఎక్కువయ్యాయని, ఇదంతా వైసీీపీ నేతల పుణ్యమేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం బర్త్ డే మాత్రమే కాకుండా...రకరకాల సందర్భాలు, కార్యక్రమాల కోసం కూడా జే ట్యాక్స్ వసూళ్లకు వైసీపీ నేతలు కొందరు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలను జే ట్యాక్స్ డామినేట్ చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. జగనన్న చేయూత పథకంతో చిరు వ్యాపారులకు రూ.10 వేలు రుణం అందించాలని బ్యాంకులకు జగన్ ఆదేశించారు. అయితే, ఆ రుణాలు బ్యాంకులు ఇవ్వకముందే జే ట్యాక్స్ వసూళ్లు ప్రారంభించారని రఘురామరాజు ఆరోపించారు.

జగన్ జన్మదిన వేడుకల పేరుతో కొందరు వైసీపీ నేతల వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని, ఒక్కో వ్యాపారి ఎంత చెల్లించాలో వైసీపీ నేతలే ఫిక్స్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నగరాల్లో కార్పొరేటర్ స్థాయి వైసీపీ నేత రూ.30 లక్షలదాకా వసూలు చేస్తున్నారంటే...రాష్ట్రవ్యాప్తంగా రూ.1000కోట్లు ఈజీగా వసూలై ఉంటాయన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ వసూళ్ల సొమ్ములో కొంత ఖర్చు పెట్టి...మరికొంత నొక్కేస్తున్నారన్న ఆరోపణలు కూడా వైసీపీ నేతలపై వస్తున్నాయి. ఇప్పటికే, కరోనా దెబ్బకు కుదేలైన వ్యాపారులపై జే ట్యాక్స్ పడడం...మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయిందని విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా...ఏపీలోని కొందరు వ్యాపారవేత్తలకు జగన్ జన్మదినం....ఈ రకంగా వసూళ్ల దినంగా మారడంపై చర్చ జరుగుతోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.