ప్రధానమంత్రిపై రూ. 900 కోట్లకు దేశప్రజలు కోర్టులో దావా వేయటం విచిత్రంగా ఉంది. విషయం ఏమిటంటే యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ ఇటలీని కూడా బాగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20వ తేదీన వెలుగు చూసిన మొదటి కరోనా వైరస్ తర్వాత దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ఇప్పటికి కరోనా వైరస్ కారణంగా దేశంలో సుమారు 70 వేలమంది చనిపోయారు. ఇదే విషయమై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది ఇటలీ ప్రధానమంత్రి గిసెప్పే కొటేపై కోర్టులో కేసు వేశారు. తమ కుటుంబసభ్యులను, ఆప్తులను, ఆస్తులను కోల్పోవటానికి ప్రదానమంత్రే కారణమంటు 100 మిలియన్ యూరోల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు కోర్టులో కేసు వేశారు. 100 మిలియన్ యూరోలంటే మన కరెన్సీలో సుమారు రూ. 900 కోట్లన్నమాట.
ఒక్క ప్రధానమంత్రిపైనే కాకుండా పనిలో పనిగా ఆరోగ్యశాఖ మంత్రి రొబర్టో స్పెనాంజా, లాంబార్డీ ప్రాంత గవర్నర్ ఆట్టిలియో ఫాంటావాల పేర్లను కూడా కేసులో ఇరికించారు. కరోనా వైరస్ సోకకుండా ప్రధానమంత్రి సరైన సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోని కారణంగానే తమకు తీరని నష్టం జరిగిందన్నది కేసు వేసిన వాళ్ళ వాదన. ప్రదాని, ఆరోగ్యశాఖ మంత్రి, గవర్నర్ గా ఉన్నదే ప్రజల ప్రాణాలను కాపాడేందుకని, అయితే వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటంలో వాళ్ళు విఫలమవ్వటం వల్లే తాము భారీగా నష్టపోయినట్లు కక్షిదారులు వాదిస్తున్నారు.
తమకు జరిగిన నష్టానికి పై ముగ్గురే బాధ్యతవహించాలి కాబట్టి పై ముగ్గురు నుండి 100 మిలియన్ యూరోలు నష్టపరిహారం ఇప్పించాల్సిందే అంటూ కోర్టులో వాదిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారిలో ఇటలీ మొదటిస్ధానంలో ఉండగా ప్రపంచం మొత్తం మీద ఐదేస్ధానంలో ఉంది. ప్రపచం మొత్తం మీద వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశం ఇటలీనే. అందువల్లే కరోనా వైరస్ కారణంగా అంతమంది చనిపోయారు. సరే దీనికి ఏ ఒక్కరినీ బాధ్యులను చేయలేకపోయినా మరి కోర్టు ఏమంటుందో చూడాలి.