కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్న రీతిలో ఇరు పార్టీల నేతల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ సోదాల పేరుతో బీజేపీ వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డి కళాశాలలు, విద్యాసంస్థలు, ఇళ్ళల్లో ఐటీ సోదాలు నిర్వహించిన వైనం సంచలనం రేపింది. ఆ వ్యవహారం మరువకముందే తాజాగా మరోసారి బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు సంచలనం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైర్ల శేఖర్ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న వైనం తెలంగాణవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఈరోజు ఉదయం నుంచి సుమారు 50 ఐటీ బృందాలు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కూకట్ పల్లిలోని జనార్దన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొత్తపేటలో శేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఐటీ రిటర్న్స్ కు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు.
హైదరాబాద్ లో వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ఆఫీసులు, షాపింగ్ మాల్స్ లలో కూడా సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఇళ్లలో కూడా హఠాత్తుగా ఐటీ సోదాలు జరిగిన వైనం చర్చనీయాంశమైంది. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలలో భారీ మొత్తంలో నగదుతోపాటు విలువైన ఆస్తి పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ల్ లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే తరహాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇల్లు, ఆఫీసులలో కూడా ఐటీ సోదాలను నిర్వహించారు.