మంత్రి మల్లారెడ్డిపై, ఆయన బంధువుల నివాసాలు, ఆఫీసులు, విద్యాసంస్థలపై ఐటి సోదాల వ్యవహారం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రెండో రోజు కూడా మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఇంట్లో నాటికి పరిణామాలు జరిగాయి. తన పెద్ద కుమారుడు ప్రభాకర్ రెడ్డిని సీఆర్పీఎఫ్ సిబ్బంది కొట్టారని మల్లారెడ్డి ఆరోపిస్తుండగా…తమపైనే మల్లారెడ్డి దాడి చేశారని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు, మల్లారెడ్డిపై పోలీసులకు ఐటి అధికారులు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది. తమపై మంత్రి మల్లారెడ్డి దాడి చేసి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లాక్కున్నారని ఐటి శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదాల సందర్భంగా తాము సేకరించిన సాక్ష్యాలను, ఆధారాలను తారుమారు చేశారని మంత్రి మల్లారెడ్డిపై రత్నాకర్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, పలు సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి స్పందించారు. కేవలం టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రిని కావడంతో తమపై ఐటి దాడులు చేయిస్తున్నారని మల్లారెడ్డి విమర్శించారు. వందల సంఖ్యలో ఐటి అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సోదాలు నిర్వహించడం తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని అన్నారు. తమ కుటుంబ సభ్యులను, కాలేజీ ప్రిన్సిపాళ్లను, స్టాఫ్ ను అందరిని రైడ్స్ పేరుతో భయభ్రాంతులకు గురి చేశారని, కేంద్ర బలగాలతో దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దాడులకు తాను భయపడనని, ఐటి, ఈడి దాడులు జరుగుతాయని కేసీఆర్ ముందే చెప్పారని మల్లారెడ్డి గుర్తు చేశారు. తమకు కేసిఆర్ ఉన్నారని, ఆయనే తమ ధైర్యం, తమ అండ అని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. అంతా కేసీఆర్ చూసుకుంటారని అన్నారు. తన ఇంట్లో సోదాలు పూర్తయిన తర్వాత తనతో, తన చిన్న కుమారుడితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తన పెద్ద కొడుకు తరపున కూడా తానే సంతకం పెడతానని చెప్పానని, అయితే, దానికి ముందు అంగీకరించిన అధికారులు…ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి తన పెద్ద కుమారుడు ప్రభాకర్ తో సంతకం పెట్టించుకొని మోసం చేశారని మండిపడ్డారు.