బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితులను జగన్ కు మరో ఛాన్స్ ఇవ్వొద్దని అన్నారు. ఆయన పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి ఒక అబద్ధాల పుట్ట అని, సైకో పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.
దేశంలో ధనిక సీఎం జగన్ అని, జగన్ మనిషా మృగమా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలను నిలువునా దోపిడీ చేస్తున్న జగన్ సైకో సీఎం అని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం విజన్ 2029 తయారు చేశానని, రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తుకు గ్యారెంటీ తనదని చంద్రబాబు భరోసానిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే చిల్లర జగ్గిరెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆయన తప్ప ఎవరూ ఆనందంగా లేరని, అంబేద్కర్ కు అన్యాయం జరిగిందని ప్రశ్నించిన దళిత యువకులపై దేశద్రోహం కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన మహా నాయకుడికి ఊరేగింపుగా స్వాగతం పలికారని ఎమ్మెల్సీ అనంత బాబును ఉద్దేశించి విమర్శించారు. జగన్ పాలనలో అందరూ మోసపోయారని, అమ్మ ఒడిలో కోతలు పెట్టారని ఆరోపించారు, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏడాదికి 20 వేలు ఇస్తామని చంద్రబాబు సంచలన హామీనిచ్చారు. రైతులకు రూ.12,500 ఇస్తానని చెప్పిన జగన్ కేంద్రం ఇచ్చే 6000 కూడా లెక్కేసుకోమని చెప్పడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇక, ఈ పర్యటనలో భాగంగా ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో చంద్రబాబు ప్రయాణించారు.
ఈ సందర్భంగా సాధారణ ప్రయాణికుడి మాదిరి టికెట్ కొన్న బాబు…బస్సులోని మహిళా ప్రయాణికులతో మాట్లాడి మహాశక్తి పథకం ప్రాముఖ్యత గురించి స్వయంగా వివరించారు. బస్సులో చంద్రబాబు ప్రయాణిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.