ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్….మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేయాలని చూశారన్న ఆరోపణలు సంచలనంగా మారటం తెలిసిందే. ఇంటికి అద్దెకు దిగి.. చివరకు ఇంటినే ఆక్రమించటమే కాదు.. నకిలీ పత్రాలతో ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారన్న కంప్లైంట్ షాకింగ్ గా మారటమే కాదు.. పెసు సంచలనాన్ని రేపింది. మొత్తానికి తాజాగా నవీన్ కుమార్ ఆ ఇంటిని ఖాళీ చేసేసి వెళ్లడంతో ఆ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లైంది.
మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంటిని అద్దెకు తీసుకున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్.. తన ఇంటిని అక్రమంగా కబ్జాకు పాల్పడినట్లుగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో పెను సంచలనమైంది. ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భన్వర్ లాల్ పని చేయడం తెలిసిందే. 2017లో రిటైర్ అయిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా సుపరిచితులు. ఆయనకు జూబ్లీహిల్స్ లో ఒక భవంతి ఉంది. దాన్ని ఐదేళ్ల లీజుకు సాంబశివరావు అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు.
రెంట్ అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా ఇంటికి తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్ లాల్ ఆరోపణ. 2019లో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ దిగారు. తమ ఇంట్లో దిగిన నవీన్ కుమార్ ను అడిగితే.. కొన్ని డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. అవన్నీ భన్వర్ లాల్ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో నకిలీ పత్రాల్ని తయారు చేసినట్లుగా ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇదంతా కూడా సాంబశివరావు.. ఆయన సతీమణి డింపుల్ కలిసి తయారు చేశారని.. దీనికి ఐపీఎస్ నవీన్ కుమార్ సహకరించారన్నది ఆరోపణ.
సీసీఎస్ పోలీసులకు భన్వర్ లాల్ కంప్లైంట్ ఇవ్వటంతో రంగంలోకి దిగిన పోలీసులు డాక్యుమెంట్లను పరిశీలించి.. సాంబశివరావు వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఫేక్ అని తేల్చారు. సాంబశివరావు.. ఆయన సతీమణి డింపుల్ ను అరెస్టు చేవారు. ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్న నవీన్ కుమార్ పైనా తాజాగా ఆరోపణలు వచ్చాయి.
మొత్తంగా తీవ్ర విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కొన్న నవీన్ కుమార్.. ఎట్టకేలకు ఈ రోజు (శుక్రవారం) ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో.. ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు.