జగన్ కళ్లలో ఆనందం చూసేందుకు ఆ ఐదేళ్లలో ఆ ఐపీఎస్ అధికారులు చేయని అక్రమం లేదు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలపై ఎడాపెడా అక్రమ కేసులు బనాయించారు. చంద్రబాబును సైతం వదల్లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎఫ్ఐఆర్లో పేరే లేకున్నా అర్ధరాత్రి నంద్యాలలో ఆయన్ను అరెస్టుచేసి విజయవాడ.. రాజమండ్రికి ఏకబిగిన తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎంగా వచ్చారు.
టీడీపీ నేతలు, శ్రేణులను, ప్రజలను ఐదేళ్లు అష్టకష్టాల పాల్జేసిన 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కానీ వారు కార్యాలయానికి రావడమే మానేశారు. హైదరాబాద్, బెంగళూరుల్లో మకాం వేశారు. మద్యం, గనులు, ఇసుక కుంభకోణాల కేసులను విచారిస్తున్న పోలీసు అధికారులకు ఫోన్లు చేసి ఫలానా వారి పాత్ర లేకుండా చూడాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నిబంధనలు పట్టించుకోకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు రోజూ కార్యాలయానికి రాకుండా సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారని వీరిపై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో డీజీపీ స్పందించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 16 మందీ ప్రతి రోజూ కచ్చితంగా హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కార్యాలయం వెయిటింగ్ హాల్లో ఉండే రిజిస్టర్లో సంతకాలు చేయాలని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆఫీస్ వేళలు ముగిసే వరకూ అక్కడే ఉండాలని, ఆఫీస్ నుంచి వెళ్లే ముందు మరోసారి రిజిస్టర్లో సంతకం చేయాలని ఆదేశించారు.
వెయిటింగ్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, పి.వి. సునీల్‌కుమార్, ఎన్. సంజయ్, కాంతి రాణా టాటా, జి.పాలరాజు, కొల్లి రఘురామి రెడ్డి, ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, సీహెచ్. విజయరావు, విశాల్ గున్ని, అన్బురాజన్ కె.కె.ఎన్, వై.రవిశంకర్ రెడ్డి, వై.రిశాంత రెడ్డి, కె.రఘువీరారెడ్డి, పి.పరమేశ్వరరెడ్డి, పి. జాషువా, కృష్ణకాంత పటేల్ నిత్యం కార్యాలయానికి రావాలని, అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. డీజీపీ ఆదేశాలతో వారికి తల కొట్టేసినట్లయింది.
వీరంతా మూకుమ్మడిగా సెలవు పెట్టినట్లు జగన్ మీడియా ప్రచారం చేసింది. అయితే అందరూ సెలవు పెట్టలేదు. ఆరుగురు మాత్రమే ఐదు రోజులు తాత్కాలిక సెలవు కోరారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే సెలవు అడిగినంత మాత్రాన ఇవ్వాలని లేదు. సహేతుక కారణం చూపితేనే మంజూరు చేస్తారు. నచ్చినట్లు సెలవు పెడతామంటే కుదరదు. నిఘా మాజీ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ మాజీ చీఫ్‌లు సునీల్ కుమార్, సంజయ్‌లకు ప్రభుత్వమే (జీఏడీ) సెలవు మంజూరు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 13 మందిలో ఎవరికి సెలవు ఇవ్వాలన్నది డీజీపీ ఇష్టం.
ఐఏఎస్‌లదీ అదే దారి…
ఐపీఎస్‌లతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులు కూడా అదే దారిలో ఉన్నారు. వెయిటింగ్ పీరియడ్‌ను ఎంజాయ్మెంట్ పీరియడ్‌గా భావిస్తున్నారు. వీరు కూడా హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండి నిత్యం సీఎస్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్టర్లో సంతకం చేసి సాయంత్రం పని వేళలు ముగిసే వరకూ సీఎస్‌కు అందుబాటులో ఉంటూ ఆయన చెప్పిన విధులు నిర్వహించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్‌లందరినీ బదిలీ చేసింది.
11 మందికి మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిలో శ్రీలక్ష్మి, రజత భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాశ్, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ భరతగుప్తా, మాధవీలత, పి.అనిల్‌కుమార్ రెడ్డి, కె.నీలకంఠ రెడ్డి, డి.హరిత పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో పలువురు హైదరాబాద్ వెళ్లిపోగా, మరికొందరు తమ సొంత పనుల్లో బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం.
ఎందుకీ ఏడుపు?
ఐఏఎస్‌లను ‘అయ్యో…ఎస్’లుగా మార్చి… ఐపీఎస్‌లతో ‘వైసీపీ’ చట్టాన్ని అమలు చేయించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదే! ఇప్పుడు… ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి జరుగుతోందంటూ ఆయన రోత పత్రిక వాపోతోంది. పలువురు అఖిల భారత సర్వీసు అధికారులకు రెండు నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా అవమానిస్తోందని తెగ ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఊరుకోకుండా… జగన్మోహన్రెడ్డి ఇలా ఎవరికీ పోస్టింగులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టలేదని, ‘ఉత్తమ సంప్రదాయాలు’ పాటించారని ఓ సర్టిఫికెట్ ఇచ్చేసింది. కానీ ఇది పచ్చి అబద్ధం.
ప్రస్తుతం సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను 2023లో పక్కన పెట్టేశారు. ఎన్నికలయ్యే దాకా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. గవర్నర్‌కు ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా.. గవర్నర్‌ను కలిసేందుకు టీడీపీ బృందానికి అనుమతి ఇచ్చారని అక్కడి నుంచి బదిలీచేసింది. అసలు కారణమేమిటంటే.. జగన్ ప్రభుత్వం తెచ్చిన ఒక అడ్డగోలు ఆర్డినెన్స్‌ను ఆయన సమర్థించలేదు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి వెనక్కి పంపేలా చేశారు.
ఈ కారణంగా ఆయనకు ఆరు నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనపడేశారు. ఆ తర్వాత పెద్దగా పనేమీ ఉండని హెచ్ఆర్డీకి విసిరి కొట్టారు. ‘మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’ అని ఇతర ఐఏఎస్‌లకు హెచ్చరిక పంపించారు. ఇక… చంద్రబాబు హయాంలో యూపీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళిని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టారు. ఆయన్ను ఇక్కడ రిలీవ్ చేయకుండా.. 14 నెలలపాటు వెయిటింగ్లో ఉంచి పైశాచికం ప్రదర్శించారు.
ఎల్వీపై తొలి వేటు…
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యానికి జగన్ చేసిన అవమానం అంతా ఇంతా కాదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయనపై.. ‘అన్నా… అన్నా’ అంటూ ప్రేమ ఒలకబోశారు. తర్వాత కొన్నాళ్లకే… ఎలాంటి కారణం చూపకుండా.. తన ఆదేశాలను కాదన్నారని బాపట్లలోని మానవ వనరుల విభాగానికి తరిమేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే సీఎస్ హోదాలో ఉన్న ఏ అధికారికీ ఎదురుకాని అనుభవమిది! ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకునే అడ్డగోలు, అర్థరహిత నిర్ణయాలకు తల ఊపలేదనే ఏకైక కారణంతోనే ఎల్వీని పక్కకు తప్పించినట్లు ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది.
‘నా మాట వినకుంటే అంతే’ అంటూ బ్యూరోక్రాట్లకు జగన్ ఇలా హెచ్చరికలు పంపించారు. సీనియర్ ఐఏఎస్ సాయిప్రసాద్‌ను జగన్ సీఎంగా ప్రమాణం చేసిన మరుసటి రోజే తప్పించేశారు. ఏకంగా 8 నెలలు వెయిటింగ్లో పెట్టారు.
ఏబీవీని ముప్పుతిప్పలు పెట్టలేదా?
సీనియర్ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కారు ముప్పుతిప్పలు పెట్టింది. ట్రైబ్యునల్ తీర్పులు, కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నా… సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు చేసింది. ఆయనకు యూనిఫాం దూరం చేసి వికృతానందం పొందింది. సస్పెన్షన్ ఎత్తివేశాక కూడా నెలలతరబడి పోస్టింగ్ ఇవ్వలేదు. చివరికి.. పదవీ విరమణ చేసే రోజున పోస్టింగ్ ఇచ్చింది. ఇక… మరో ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యాన్నీ జగన్ ఇలాగే సతాయించారు. రెండు విడతల్లో ఐదునెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు.
జగన్ వల్లే అసలైన అవమానం..
ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు అవమానం జరిగిందంటే… అది జగన్ నిర్వాకం వల్లే! జగన్ పాపాల వల్లే శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య వంటి ఐఏఎస్‌లు జైలు పాలయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సగటున నెలకు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి తల దించుకుని హైకోర్టు ముందు నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరికి శిక్షలు కూడా పడ్డాయి. కోర్టు దయతలచి మినహాయింపు ఇవ్వకుంటే వారూ జైళ్లకు వెళ్లే వారే.
ఐఏఎస్, ఐపీఎస్‌లను తన సొంత పాలేర్లలా వాడుకున్న ఘనత జగన్‌ది. తన మాటకు తలూపితే ఒక లెక్క.. తప్పును ఎత్తి చూపితే మరో లెక్క! బ్యూరోక్రాట్లను అడ్డదిడ్డంగా వాడుకుని తర్వాత ఈడ్చి పడేయడం ఆయన నైజం. సీఐడీ ఛీఫ్‌గా పని చేసిన సునీల్ కుమార్‌ను టీడీపీ నేతలను వేధించేందుకు అడ్డగోలుగా వాడుకుని… ఎక్కడో తేడా రావడంతో ఆయనను ఎక్కడో పడేయడం మచ్చుకు ఒక ఉదాహరణ.
ఇది సత్కారమా?
జగన్ పాలనలో 15 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను… 170 మందికి పైగా అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలను నెలలు, సంవత్సరాల తరబడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ‘వెయిటింగ్’లో పెట్టారు. ఇది… వాళ్లను అవమానించడం కాదా? ఐపీఎస్‌లలో అత్యంత సీనియర్‌ను డీజీపీగా నియమించాలి. కనీసం… టాప్-5 నుంచి డీజీపీని ఎన్నుకోవడం రివాజు. కానీ… ఎక్కడో 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి జగన్ డీజీపీ పోస్టు కట్టబెట్టారు. ఇది… సీనియారిటీ లిస్టులో ఆయనకంటే పైన ఉన్న 14 మందిని అవమానించడం కాదా?
ప్రభుత్వం మారినప్పుడు కీలక స్థానాల్లో ఉండే అధికారులను మార్చడం సహజం! పైగా… ఇప్పుడు ‘వెయిటింగ్’లో ఉన్న వారిలో అత్యధికులు ‘మామూలు’ అధికారులు కాదు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ కీలకనేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులే ధ్యేయంగా పని చేసిన వాళ్లే! తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. వారు చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ… అక్రమాలపై సాక్ష్యాధారాలున్నప్పటికీ చంద్రబాబు వారిని సస్పెండ్ చేయలేదు.
వాళ్లంతా సర్వీసులోనే ఉన్నారు. అంటే వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా అనుభవిస్తారు. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి, డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన అధికారులు రోజూ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలి. మిగిలిన అధికారులతోపాటు కూర్చోవాలి. వీరిని అత్యవసర సేవలకు ఉపయోగించుకునే అవకాశముంటుంది. ఏవైనా కారణాల వల్ల రాలేకపోతే… ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ… ‘వెయిటింగ్’లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లు హెడ్‌క్వార్టర్స్‌కే రావడంలేదు. అందుకే… రోజూ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలని డీజీపీ మెమో జారీ చేశారు. ఇదేమీ నిబంధనలకు విరుద్ధం కాదు! కానీ… ‘మా వాళ్లను ఆఫీసుకు పిలిచి సంతకం చేయమంటారా?’ అని వైసీపీ నేతలు వాపోవడమే విచిత్రం!