సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సుధీర్ఘ పోరాటం ఫలించింది. సస్పెన్షన్ లో ఉన్న ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. గతంలోనూ ఈ రోజు విధులలో చేరనున్న ఆయన ఈ సాయంత్రం పదవీ విరమణ చేయనుండడం విశేషం.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రక్షణ వ్యవహారాల పరికాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది. దీంతో ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. చివరికి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ ఎత్తివేసింది.
మొదట సస్పెన్షన్ ఎత్తివేతకు క్యాట్ నిరాకరించడంతో ఆయన హైకోర్టుకు వెళ్లగా న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఎబి వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంటే గత ఐదేళ్ల కాలంలో ఆయన పధ్నాలుగు రోజులు మాత్రం పోస్టింగ్‌లో ఉన్నారు. సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జీత భత్యాలు కూడా దక్కలేదు. ఎట్టకేలకు సుధీర్ఘ పోరాటం అనంతరం ఆయన ఈ రోజు పదవీవిరమణ చేయనుండడం విశేషం.