భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతుంది. మే 17 నుంచి ఐపీఎల్ ను రీస్టార్ట్ చేయాలని బీసీసీఐ సోమవారం నిర్ణయించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ హ్యాచ్ జరగనుంది. చండీగఢ్ సమీపంలో భారత వైమానిక స్థలాన్ని పాకిస్తాన్ ఆక్రమించడానికి ప్రయత్నించడంతో పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దు అయింది. మే 8న ఐపీఎల్ నిలిపివేశారు. దీని ఫలితంగా స్టేడియం బ్లాక్‌అవుట్ అయింది.
అయితే ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ నిన్న అత్యవసరంగా సమావేశమై ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం లీగ్ మ్యాచ్‌ల కోసం ఆరు వేదికలు ఖరారు చేశారు. ఈ జాబితాలో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ మరియు ముంబై ఉన్నాయి. ఒక మ్యాచ్ కూడా ఉప్పల్, విశాఖ స్టేడియాల్లో నిర్వహించకపోవడం తెలుగు క్రికెట్ లవర్స్ ను నిరాశ పరిచే అంశం.
ఇక లీగ్ పునఃప్రారంభమైన తర్వాత మొదటి మ్యాచ్ మే 17న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతుంది. అలాగే మే 29 నుంచి క్వాలిఫయర్-1తో ప్లేఆఫ్స్ స్టార్ట్ అవుతాయి. మే 30న ఎలిమినేటర్, జూన్ 2న క్వాలిఫయర్-2, జూన్ 3న ఫైనల్ జరుగనున్నాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం ఆరు వేదికలు తరువాత ప్రకటించబడతాయి. ఆరు వేదికలలో మొత్తం 17 మ్యాచ్‌లు జరుగుతాయి. మరియు సవరించిన షెడ్యూల్‌లో రెండు డబుల్-హెడర్‌లు ఉన్నాయి. కాగా, బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ.. ఓవర్సీస్ ఆటగాళ్ల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ఇండియాకు తిరిగి వస్తారా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.