అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో.. ఇలా యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. సంచలన నిర్ణయాలతో దూకుడుగా వ్యవహిరిస్తున్నారు. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు కంకణం కట్టుకున్న ట్రంప్.. ఇప్పటికే జన్మతః పౌరసత్వం దక్కే విధానికి స్వస్థి పలికారు. ఇక మరోవైపు ట్రంప్ రాకతో అమెరికాలో ఉన్న ఇండియన్ స్మూడెంట్స్ లో భయం మొదలైంది. వరుస పెట్టి పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్నారు. కాలేజీలకు వెళ్లొచ్చిన తర్వాత టైమ్ ఉంటున్నా కూడా పార్ట్ టైమ్ వైపు మొగ్గు చూపడం లేదట.
ఇందుకు కారణం లేకపోలేదు.. నిజానికి స్టడీస్ కోసం అమెరికా వచ్చిన వారు పార్ట్ టైమ్ జాబ్ చేయడం చట్టవిరుద్ధం. అయితే విద్యార్థులకు వారి యూనివర్సిటీలోనే వారానికి 20 గంటలు పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ విద్యార్థులు వందలాదిగా ఉండటం వల్ల.. అందరికీ పని దొరకదు. ఈ క్రమంలోనే చాలా మంది విద్యార్థులు లక్షలు అప్పు చేసి తమను అమెరికాకు పంపిన తల్లిదండ్రులకు మరింత భారం కాకూడదని భావించి అనధికారికంగా బయట పార్ట్ టైమ్ చేస్తుంటారు. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, పెట్రోల్ బంక్స్ లో పని చేస్తూ నెలవారీ ఖర్చుల కోసం సంపాదించుకుంటారు.
అయితే ఇటీవల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. తొలిరోజే వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎఫ్-1 వీసాపై వచ్చిన విదేశీ విద్యార్థులు నిబంధనలు ఉల్లంఘించి పనులు చేసేందుకు వీళ్లేదని హెచ్చరించారు. దీంతో చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, స్టూడెంట్ వీసా మీద వచ్చిన విద్యార్థులు పార్ట్ టైమ్ చేస్తూ దొరికితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. మళ్లీ తిరిగి యూఎస్ వెళ్లేందుకు ఛాన్స్ కూడా ఉండదు.
అదే జరిగి ఇండియాకు వెళ్లిపోవాల్సి వస్తే.. చదువుల కోసం చేసిన అప్పు తీర్చే మార్గం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్నారట. అక్కడి ఖర్చులు తట్టుకునేందుకు పార్ట్ టైమ్ ఎంతో అవసరం అయినప్పటికీ.. భవిష్యత్తు కోసం ఉద్యోగాలు మానేస్తున్నారట.