సామాజిక మాథ్యమాల దిగ్గజం.. ప్రపంచ వ్యాప్తంగా పలు సంచలనాలకు.. రాజకీయ పరిణామాలకు..ఉద్యమాలకు అనుసంధానకర్తగా వ్యవహరించే ట్విటర్ కు మోడీ సర్కారు డబుల్ వార్నింగ్ ఇచ్చింది. ఒకేరోజు ఒకే అంశం మీద రెండు హెచ్చరికల్ని జారీ చేయటం గమనార్హం. మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రైతుల ఆందోళనలోసోషల్ మీడియా కీలకం కావటం తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్రం చెప్పాల్సిన రీతిలో చెప్పుకొచ్చింది.
రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాల్ని పునరుద్దరించే విషయంలో ట్విటర్ వ్యవహరిస్తున్న ధోరణిని తీవ్రంగా తప్పు పట్టింది. ప్రభుత్వ ఆదేశాల్ని పాటించకపోతే చర్యలు తప్పవన్న వార్నింగ్ ఇచ్చింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ శివారులో జరుగుతున్న ప్రచారానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారని.. రెచ్చగొట్టేలా ట్వీట్ చేయటాన్ని తప్పు పట్టింది.
తప్పుడు సమాచారం చేరవేసే ఖాతాల్ని నిలిపివేయాలని.. సదరు ట్వీట్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. వంద ఖాతాల్ని నిలిపివేసి.. 150 ట్వీట్లను తొలగించింది. వీటిలో కిసాన్ ఏక్ మోర్చా.. బీకేయూ ఖాతాలు కూడా ఉన్నాయి. బ్లాక్ చేసిన అకౌంట్లను కొన్ని గంటల వ్యవధిలోనే ట్విటర్ పునరుద్ధరించింది. దీనిపై కేంద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
‘ట్విటర్ ఒక మాథ్యమం మాత్రమే. తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాల్ని పాటించాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొంటూ ఖాతాల్ని నిలిపివేసే ఆదేశాలు పాటించనందుకు నోటీసులు జారీ చేసింది. మరి.. దీనికి ట్విటర్ ఏ రీతిలో రియాక్ట్ అవుతుందో చూడాలి.