టెస్టు క్రికెట్లో అన్నిసార్లూ విజయాలే గొప్పవిగా నిలిచిపోవు. కొన్నిసార్లు డ్రాలు కూడా చరిత్రాత్మకం అవుతాయి. సోమవారం సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ముగిసిన మూడో టెస్టు ఈ కోవకే చెందుతుంది. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ఉదయం ఆట ఆరంభమైన తీరు చూశాక భారత్ ఓటమి నుంచి బయటపడుతుందని ఎవ్వరికీ ఆశల్లేవు. 407 పరుగుల భారీ లక్ష్యం ముందుండగా.. ఓవర్ నైట్ స్కోరు 98/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. రెండో ఓవర్లోనే కెప్టెన్ రహానె (4) వికెట్ కోల్పోయింది. చివరి రోజు ఇంకా 88 ఓవర్లు ఆడాలి. పుజారా మినహాయిస్తే క్రీజును అంటిపెట్టుకుని ఆడే బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. పంత్, జడేజాలిద్దరూ గాయాలతో బాధపడుతున్నారు. ఈ స్థితిలో భారత్‌కు పరాభవం తప్పదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ భారత్ అసాధారణ పోరాటంతో ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.గాయంతో బాధ పడుతూనే బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. ఆస్ట్రేలియా బౌలర్లపై అనూహ్యంగా ఎదురుదాడి చేశాడు. వన్డే తరహా ఇన్నింగ్స్‌తో సెంచరీకి చేరువగా వెళ్లాడు. మరో ఎండ్‌లో పుజారా దుర్బేధ్యమైన డిఫెన్స్ ఆడాడు. ఒక దశలో భారత్ 250/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంకా 55 ఓవర్లుండగా 157 పరుగులు చేస్తే భారత్‌దే విజయం.
ఆస్ట్రేలియాకు టీమ్ ఇండియా షాకిస్తూ సంచలన విజయం సాధిస్తుందా అన్న ఆశలు కలిగాయి అప్పుడు. కానీ సెంచరీకి కేవలం 3 పరుగుల ముందు పంత్ ఔటైపోయాడు. ఇంకో గంటకు పుజారా 77 పరుగుల వద్ద ఔటయ్యాడు. సగం వికెట్లు పడిపోయాయి. ఇక విహారి మాత్రమే చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్. అతను ఫామ్‌లో లేడు. అతడికి తోడైన అశ్విన్ మీద కూడా పెద్దగా ఆశల్లేవు. ఇంకా 44 ఓవర్లు ఆడాల్సి ఉండటంతో భారత్‌కు పరాజయం తప్పదనే అనిపించింది. కానీ విహారి, అశ్విన్ అద్భుత పోరాటంతో ఆస్ట్రేలియాకు షాకిచ్చారు. ఇద్దరూ కలిసి ఇంకో వికెట్ పడకుండా మిగిలిన ఓవర్లన్నీ ఆడేశారు. తెలుగువాడైన విహారి తొడ కండరాల గాయంతో బాధ పడుతూనే 161 బంతులాడి 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. అశ్విన్ 128 బంతులాడి 39 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. జడేజాకు వేలు విరిగినప్పటికీ.. అవసరమైతే బ్యాటింగ్ చేద్దామని ప్యాడ్లు కట్టుకుని సిద్ధం కావడం విశేషం. గొప్ప పోరాటంతో మ్యాచ్‌ను కాపాడుకున్న భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక ప్రత్యేక మ్యాచ్ అనడంలో సందేహం లేదు. ఐతే ఈ మ్యాచ్‌ను భారత్ బాగానే కాపాడుకుంది కానీ.. ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డున్న, ఫాస్ట్ బౌలర్ల స్వర్గధామంగా పేరున్న గబ్బా స్టేడియంలో చివరి టెస్టు జరగబోతుండటం మాత్రం భారత్‌కు ఆందోళన రేకెత్తించేదే. అక్కడ టెస్టు మ్యాచ్ ఆడిన ప్రతిసారీ భారత్ ఓడిపోయింది. గాయాల వల్ల జడేజా, పంత్ ఆ మ్యాచ్‌లో ఆడటం సందేహంగా మారడం కూడా భారత్‌కు ప్రతికూలమే.