గత ప్రభుత్వానికి ఏపీ మాజీ సీఎస్ జవహర్ రెడ్డి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ను ఏపీకి నూతన సీఎస్ గా నియమించారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుతో సీఎస్ నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎంఓ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర నియమితులయ్యారు.
మరోవైపు, ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేశారు. ప్రస్తుతం సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. రేవు ముత్యాలరాజు సీఎంవోలో కార్యదర్శి హోదాలో ఉండగా, నారాయణ భరత్ గుప్తా అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఈ ముగ్గురూ జీఏడీకి రిపోర్టు చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.