ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ఐ ప్యాక్ గొప్పగా పని చేసిందంటూ ఆ సంస్థ కార్యాలయానికి స్వయంగా వెళ్లిన జగన్ హంగామా చేశారు. అక్కడి ఉద్యోగులతో సెల్ఫీలు తీసుకుంటూ హడావుడి చేశారు. ఓ వైపు ప్రశాంత్ కిశోర్…జగన్ మాత్రం తన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఐ ప్యాక్ అండ తనకు ఉందని జగన్ చాటేందుకే ఈ ప్రయత్నమనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
కానీ, జగన్ స్వయంగా వెళ్లి కలిసినా ఏపీకి ఐ ప్యాక్ ప్యాకప్ చెప్పేసిందనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. హఠాత్తుగా 300 మంది ఐ ప్యాక్ ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోవడమే అందుకు కారణం. జగన్ నేరుగా విజయవాడలోని ఆ సంస్థ కార్యలయానికి వెళ్లి, ఐ ప్యాక్ సేవలు కొనసాగుతాయని చెప్పినా ఆ ఉద్యోగులు వెళ్లిపోవడం వైసీపీకి మింగుడుపడటం లేదు. ఈ సారి ఎలాగో వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని తెలిసే ఐ ప్యాక్ తట్టాబుట్టా సర్దుకుందనే టాక్ వినిపిస్తోంది. మొదట వైనాట్ 175 అంటూ జగన్ ప్రచారాన్ని మొదలెట్టినా.. ఇప్పుడు గెలిచే పరిస్థితి కూడా లేదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఓ వైపు ఐ ప్యాక్ ఉండగానే మరోవైపు సజ్జల తనయుడు భార్గవ్ ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా ఎన్నికల కోసం పనిచేసింది. కానీ పోలింగ్ ముగిసిన వెంటనే ఈ దుకాణాన్ని ఎత్తేశారని తెలిసింది. ఎలాగో వైసీపీ ఓడిపోతుందని ముందే సజ్జల జాగ్రత్త పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఐ ప్యాక్ కూడా జెండా ఎత్తేసిందని చెబుతున్నారు.