ఏపీ సీఎం జగన్ నియమించుకున్న ఐప్యాక్.. ఆయనకు ఎంత వరకు మేలు చేసిందో తెలియదు కానీ.. ఆయన పరువు అయితే తీసేసిందని వైసీపీ కార్యకర్తల్లో చర్చగా మారింది. ఎందుకంటే.. ఇటీవల రెండు రోజుల కిందట సీఎం జగన్ లండన్‌కు వెళ్తూ.. ఐప్యాక్ టీంతో చర్చించారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. శుభాకాంక్షలు కూడా చెప్పారు. పార్టీ కోసం పనిచేశారని.. పార్టీని గెలిపిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. తాము 151కి సీట్లు కూడా గెలుస్తున్నామని.. ఇదంతా ఐప్యాక్ కృషేనని కూడా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఐప్యాక్ టీంతో సీఎం జగన్ సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఈ టీంలో ఉన్న కొందరు యువతులు, యువకులు.. సాధారణ సోషల్ మీడియాలో చేసిన పోస్టుల్లో కనిపించడంతో ఐప్యాక్.. గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ముందు.. అనేక వీడియోలు హల్చల్ చేశాయి. వీటిలో కొందరు యువతులు.. జగనన్న విద్యా దీవెనతో తాము ఎంతో వృద్ధిలోకి వచ్చామని.. జగన్‌కే తమ కుటుంబం వోటు వేస్తుందని చెప్పుకొచ్చారు.
ఆ యువతులు.. ఈ ఐప్యాక్ టీం సభ్యులే. అంతేకాదు.. ఒకరిద్దరు యువకులు.. జగన్ ఇచ్చిన ఆరోగ్య శ్రీతోనే తమ కుటుంబంలో తల్లిదండ్రులను కాపాడుకున్నామని.. తమ పిల్లలను కూడా చదివించుకు న్నామని.. ఎన్నికలకు ముందు ఓ మీడియాకు ఇచ్చిన బైట్లలో వెల్లడించారు. తీరా చూస్తే.. వారు ఐప్యాక్ సిబ్బందేనని తాజాగా వెల్లడైంది. ఇంకొందరు.. అమ్మ ఒడి ద్వారానే.. తాము చదువుకుని.. ఉన్నత స్థాయికి చేరుకున్నామని తెలిపారు. కట్ చేస్తేవారు కూడా ఐప్యాక్ టీం బ్యాచేనని ఇప్పుడు బహిర్గతమైంది.
అంతేకాదు.. జగనన్న ఇళ్లు, విద్యాదీవెన, ఆసరా, రైతు భరోసా పథకాల ద్వారా తమ జీవితాల్లో వెలుగు ప్రసరించాయని చెప్పుకొన్న వారు కూడా ఈ బృందంలోనివారే కావడంతో ఇప్పుడు అందరూ పెదవి విరుస్తున్నారు. `అమ్మ ఐప్యాక్` అంటూ.. బుగ్గలు నొక్కుకుంటున్నారు. మొత్తానికి జగన్ పరువు తీశారంటూ.. వైసీపీ నాయకులు గుసగుసలాడుతుండడం గమనార్హం.