ఎంత కాదనుకున్నా టాలీవుడ్లో వర్గాలు ఉన్న మాట వాస్తవం. పెద్ద సినీ కుటుంబాలకు చెందిన హీరోలకు మద్దతుగా నిలిచే అభిమానులే కాదు.. హీరోలు కూడా ఉన్నారు. యువ కథానాయకుల్లో కొందరి మీద ఫలానా వర్గం అనే ముద్ర పడిపోవడం మామూలే. ఇలా విశ్వక్సేన్ మీద కూడా ఒక ముద్ర పడింది. అతను జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. అలాగే నందమూరి బాలకృష్ణను కూడా అభిమానిస్తాడు. ఆ ఇద్దరితోనూ అతను సన్నిహితంగా కనిపిస్తుంటాడు.
తన సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు ఈ హీరోలను అతిథులుగా కూడా పిలుస్తుంటాడు. ఇటీవల బాలయ్య సినిమా డాకు మహారాజ్ హిట్టయితే దాని సక్సెస్ పార్టీలో సైతం విశ్వక్ దర్శనమిచ్చాడు. అలాంటిది తన కొత్త చిత్రం లైలాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
గురువారం ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాన్ని విశ్వక్ వెల్లడించగానే విలేకరులు సైతం ఆశ్చర్యపోయి.. ఇదేంటి మీరు నందమూరి కాంపౌండ్ హీరో కదా అని అడిగారు. దీనికి విశ్వక్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ఈ కాంపౌండ్లు, గ్రూప్లు అన్నవి మీరు క్రియేట్ చేసినవి. మీరే వాటి గురించి రాస్తారు. ప్రచారం చేస్తారు. మాకు అలాంటి కాంపౌండ్స్ ఏమీ ఉండవు. మేమందరం ఒకటే. నాకు ఉన్నది ఒకటే కాంపౌండ్. అది నా ఇంటి కాంపౌండ్.
నాకు అందరు హీరోలూ ఇష్టం. మా సినిమా అవసరాలను బట్టి, మాకున్న పరిచయాలతో హీరోలను ప్రమోషనల్ ఈవెంట్లకు పిలుచుకుంటాం. వాళ్లు కూడా సహకరిస్తారు. చిరంజీవి గారితో నాకు మంచి రిలేషన్ ఉంది. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడే మా నాన్నకు రాజకీయంగా పరిచయం ఉంది. అప్పట్లో మా నాన్న మలక్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కాబట్టి ఈ కాంపౌండ్లు, గ్రూపులు అని చెప్పి మమ్మల్ని వేరు చేయకండి అని విశ్వక్ స్పష్టం చేశాడు. లైలా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.