2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ జగన్ తీసుకున్న నినాదం ఎంత ఘోరంగా విఫలమైందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. అంతేకాదు, ఏకంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి వై నాట్ కుప్పం అంటూ వైసీపీ నేతలు ఊదరగొట్టారు. కానీ, చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితికి చేరి ఇప్పుడు అదే హోదా కోసం అసెంబ్లీ లోపల, వెలుపల రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
వై నాట్ 175, వై నాట్ కుప్పం అన్నవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని చంద్రబాబు ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో సరిగా చేసుకుని ఉంటే పులివెందులలోనూ మనమే గెలిచేవాళ్లం అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. జీడీ నెల్లూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“30 ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేశాం. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. మీకు నేను పూర్తిగా సహకరిస్తా. ఈ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా మార్చాలి. తంబళ్లపల్లి, పుంగనూరులో కొంచెం గురి తప్పాం తప్ప జిల్లా అంతటా టీడీపీ జెండా ఎగిరింది.’’ అని చంద్రబాబు అన్నారు.
పార్టీ పెట్టినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కానీ, 2024 ఎన్నికల్లో పకడ్బందీగా వ్యవహరించామని అన్నారు. అందుకే, ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు గెలిచామని చెప్పారు. ఎన్ని ఇబ్బందుల పెట్టినా…ఆఖరుకు ప్రాణాలు పోయినా పర్వాలేదని వైసీపీ నేతలతో పోరాడి 93 శాతం సీట్లు సాధించామని అన్నారు.
‘‘2004, 2019లో పార్టీని నేనే ఓడించుకున్నా. రాష్ట్రాన్ని బాగు చేయాలని, ప్రజల తలరాతలు మార్చాలని కార్యకర్తలను పట్టించుకోకుండా పని చేశా. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలబెట్టా. 2004లో ఓడిపోయాక అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. 2014 సమయంలో సమైక్య ముసుగులో వైసీపీ విభజన కోరుకున్నా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మనల్ని గెలిపించారు’’ అని చంద్రబాబు చెప్పారు.
కార్యకర్తల్లో అసంతృప్తి వల్లే 2004, 2019లో ఓడిపోయామని అన్నారు. టీడీపీ కార్యకర్తల అనువణువునా పసుపు రక్తం తప్ప మరొకటి ఉండదదని చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడకుంటే తనపై కూడా వారు అసంతృప్తిలో ఉంటారని, అందుకే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేశానని అన్నారు. ఇకపై, తనకు, కార్యకర్తలకు మధ్య దూరం ఉండదని తెలిపారు.
వైసీపీ నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకారం చేసే పరిస్థితి ఉండకూడదని, వైసీపీకి ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లేనని చెప్పారు. పార్టీ శ్రేణులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఉండొద్దని, నాయకత్వం కింద పనిచేయాలని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వన్ టైంగా చూసుకోవద్దని, చాలాకాలం ప్రజాప్రతినిధులుగా ఉండాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో నా మిత్రులను కూడా పక్కనబెట్టా. అవసరమైతే మీతో కలిసి టీ తాగుతా, భోజనం చేస్తానని చెప్పాగానీ పార్టీని త్యాగం చేయనని నా మిత్రులకు స్పష్టంగా చెప్పానని చంద్రబాబు అన్నారు.