తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి అక్రమంగా కట్టిన పలు కట్టడాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న వైనం సంచలనం రేపుతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవ్వరి భవనమైనా హైడ్రా వదిలిపెట్టడం లేదు. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను సైతం హైడ్రా కూల్చివేయడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా నాగార్జున మాదిరే ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా షాకిచ్చింది.
హైదరాబాద్ లోని రంగాళ్‌కుంట చెరువులో జయభేరి సంస్థకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగాళ్‌కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను తొలగించాలని నోటీసులలో పేర్కొంది. అయితే, హైడ్రా జారీ చేసిన నోటీసులపై జయభేరి సంస్థ ఇంకా స్పందించ లేదు. మాదాపూర్‌లో తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాలును హైడ్రా కూల్చివేయడం, దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్లోని నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం తెలిసిందే.