గత కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న హైడ్రా మరోసారి అక్రమ నిర్మాణాలపై బుల్ డోజర్లు ప్రయోగించేందుకు రెడీ అయింది. గత రెండు నెలలుగా.. హైడ్రా కొంత దూకుడు దక్కించింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటిని కూడా కూల్చివేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే.. ఆ తర్వాత హైడ్రా అనూహ్యంగా సైలెం ట్ అయిపోయింది. దీంతో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం.. హైడ్రా సృష్టించిన హైడ్రామా లేకుండా పోయింది. అయితే.. ఇప్పుడు మరో రూపంలో హైడ్రా కొరడా ఝళిపించేందుకు రెడీ అయింది.
తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కూల్చి వేతలు తప్పవని.. అయితే.. కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా మౌనంగా ఉంటే.. దానర్థం పూర్తిగా సుప్తచేతనావస్థలోకి జారుకున్నట్టుగా కాదన్నారు. ప్రజల కష్టాలు గమనించి.. కొన్ని మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది జూలై తర్వాత.. చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని చెప్పారు. అయితే.. ప్రభుత్వం నుంచి రెగ్యులరైజేషన్ కోసం అనుమతులు తెచ్చుకుంటే తాము ఏమీ చేయబోమన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో హైడ్రా ఏర్పడక ముందు(ఈ ఏడాది జూన్) కట్టిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చి వేయబోమని రంగనాథ్ చెప్పారు. అలాగే గతంలో పర్మిషన్ తీసుకున్న వాటి జోలికి(అక్రమమైనా?) కూడా వెళ్లేది లేదన్నారు. ఇక, నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకునే ప్రతి ప్లాన్ను.. ఇంటి నిర్మా ణాన్ని కూడా.. తాము నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నగరాన్ని పరిరక్షించేందుకు నడుం బిగించినట్టు తెలిపారు.
ఈ మార్పుపై రగడ!
కాగా.. రంగనాథ్ చేసిన ప్రకటన పై రాజకీయ వర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి. వెసులుబాటు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందన్నది ప్రధాన ప్రశ్న. ఇప్పటి వరకు కూల్చేసిన వాటి మాటేంటని.. వారు నిలదీస్తున్నారు. ఎవరినో కాపాడేందుకు నిబంధనల్లో మార్పులు చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని తెలిపారు. పేదల ఇళ్లను, దిగువ మధ్య తరగతి ఇళ్లను కూడా కూల్చి వేశారని.. అప్పుడు ఈ నిబంధనలు ఎందుకు గుర్తుకు రాలేదని వారు ప్రశ్నిస్తున్నారు.