హైదరాబాద్ లోని ఘట్ కేసర్ సమీపంలో బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తనను ఓ ఆటో డ్రైవర్ తో పాటు మరికొందరు గ్యాంగ్ రేప్ చేశారంటూ బాధిత యువతి సంచలన ఆరోపణలు చేసింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టగా…ఈ వ్యవహారంలో యువతి తీరుపై అనుమానాలు రేకెత్తాయని ప్రచారం జరిగింది. ఆ యువతి తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్లిందని, లేట్ కావడంతో తన తల్లి పదే పదే ఫోన్ చేస్తుండడంతో కిడ్నాప్ డ్రామాకు తెర తీసిందని ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ప్రచారం నిజమని రాచకొండ పోలీసులు తేల్చేశారు. బాధిత యువతిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.ఆ యువతికి తన తల్లిదండ్రులతో ఉండడం ఇష్టం లేదని, ఇంట్లోంచి పారిపోయే ఉద్దేశంతోనే ఆ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించిందని రాచకొండ పోలీసు కమిషనర్ ఎం.మహేశ్ భగవత్ వెల్లడించారు.
ఆ యువతి తనను కిడ్నాప్ చేశారంటూ ఓ ఆటోడ్రైవర్ ఫొటోను చూపించిందని, అతనితోపాటు మరికొందరు తనపై అత్యాచారం జరిపారని చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఆ యువతి ఆరోపణ ప్రకారం పలువురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా..ఆమె ఆరోపణల్లో నిజం లేదని తేలిందని భగవత్ చెప్పారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఆ ఆటో డ్రైవర్ వేరే చోట ఉన్నాడని, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా లభించిందని, దీంతో, అతడు అమాయకుడని తేలిందని వెల్లడించారు.
కిడ్నాప్ అయిన రోజు ఆ యువతి ప్రయాణించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆమె గుట్టు రట్టయిందని వెల్లడించారు. తన దుస్తులు తానే చించుకొని గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని, ఆ యువతి చెప్పిన మాటలు నమ్మి డాక్టర్ కూడా రేప్ జరిగిందని ప్రకటన ఇచ్చారని అన్నారు. ఆ యువతి సమాధానాలకు నిజాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా ఆమె నిజాన్ని వెల్లడించిందని భగవత్ చెప్పారు. తనకు ఇంట్లో తల్లిదండ్రులతో ఉండడం ఇష్టం లేదని, ఎక్కడైనా ఒంటరిగా గడపాలని ఉందని చెప్పిందని భగవత్ తెలిపారు.
తనపై అత్యాచారం జరిగిందని తెలిస్తే.. తల్లిదండ్రులే వదిలించుకుంటారని ఈ డ్రామా ఆడినట్టు అంగీకరించిందన్నారు. లాక్డౌన్ సమయంలో తాను నింద వేసిన ఆ ఆటోడ్రైవర్ ఎక్కువ చార్జీ వసూలు చేసి, పొగరుగా మాట్లాడాడని అందుకే ఈ కేసులో అతడిని ఇరికించానని యువతి అంగీకరించిందని భగవత్ చెప్పారు. ఇంత డ్రామా ఆడినా ఆ యువతిలో పశ్చాత్తాపం లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని సీపీ వివరించారు.
యువతి చెప్పిన వివరాలను బట్టి కొందరు ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని ఆటోడ్రైవర్లను భగవత్ క్షమాపణ కోరారు. విచారణ కారణంగా వారు ఉపాధి కోల్పోయారని, వారికి రూ.1000 నగదు, బియ్యం అందజేశామన్నారు.