మీరు సున్నిత మనస్కులా? అయితే.. దయచేసి ఈ దారుణ హత్య గురించి అస్సలు చదవొద్దు. ఎందుకంటే.. ఈ కిరాతక ఘటన.. మీరు చదివిన తర్వాత కొన్ని గంటలు మొదలు కొని కొన్ని రోజుల వరకు వెంటాడే ప్రమాదం ఉంది. అందుకే.. ఈ సూచన చేస్తున్నాం. హైదరాబాద్ మహానగర పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భర్త చేసిన కిరాతక ఘటన గురించి తెలిసినంతనే.. మనసంతా వికారంగా మారుతుంది.
అనుమానం పెనుభూతంగా మారి.. భార్యను దారుణంగా చంపేయటమే కాదు.. అతడి కసి చూస్తే.. మనిషిలో ఇంత కసాయి దాగి ఉంటాడా? అన్న భావన కలుగక మానదు. ఇంతకూ అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మహానగర శివారులోని మీర్ పేటలోని జిల్లెలగూడ న్యూ వెంకటరమణ కాలనీలో భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన కసాయి భర్త ఉదంతంగా చెప్పాలి. భార్యను దారుణంగా పొట్టన పెట్టుకున్న భర్త.. ఆమెను చంపేసి.. ఏమీ తెలియని అమాయకుడిగా తన తల్లిదండ్రుల్ని తీసుకొని.. తన భార్య కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడీ ముదురు భర్త గురుమూర్తి.
ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేవని.. ఇరువురు తరచూ గొడవ పడుతుంటారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఇచ్చిన తనను విచారిస్తారా? అంటూ ముందు వాదించినా.. తమదైన శైలిలో విచారణ షురూ చేయగానే.. తాను చేసిన కిరాతకాన్ని పూస గుచ్చినట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అతడు చెప్పిన వివరాల్ని విన్న విచారణలోని పోలీసులు సైతం షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది.
తానే భార్యను హత్య చేశానని.. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించానని.. కమర్షియల్ సిలిండర తెచ్చి మరీ.. పెద్ద ఎత్తున ఉడికించిన అనంతరం దానిని పొడిగా మార్చినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆ పొడిని దగ్గర్లోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లుగా సమాచారం. గురుమూర్తి వెల్లడించిన సమాచారానికి సరిపోయే ఆధారాల్ని సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. స్థానికంగా పెను సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా నోట మాట రానట్లుగా షాక్ కు గురవుతున్నారు.