తెలంగాణలోని కోల్ బెల్ట్ సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ మెజారిటీ స్తానాల్లో విజయం దక్కిం చుకుంది. మొత్తం పదకొండు స్థానాలకు గాను ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధం కార్మిక సంఘం ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. ఇదేసమయంలో సీపీఐ నేతృత్వంలోని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఐదు స్థానాలను కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ దక్కించుకున్న వాటిలో ఇల్లెందు, మణుగూరు, రామగుండం-3, కొత్తగూడెం, భూపాలపల్లి ఉండగా, ఏఐటీయూసీ దక్కించుకున్న వాటిలో బెల్లంపల్లి, రామగుండం 1, 2, శ్రీరాంపూర్, మందమర్రి స్థానాలు ఉన్నాయి. కాగా, మొత్తం 11 కేంద్రాల్లో సింగరేణి ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో 96.3% పోలింగ్ నమోదైంది. ఇక, సింగరేణి ఎన్నికల పోలింగ్‌కు కార్మికులు భారీగా హాజరై ఓటేశారు. మొత్తం 11 ఏరియాల్లో 39773 ఓట్లకు 37468 పోలైన ఓట్లు పోలయ్యాయి.
6 జిల్లాల పరిధిలో మొత్తం 11 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. 13 కార్మికల సంఘాలు బరిలో ఉన్నప్పటికీ సీఐటీయూసీ – ఏఐటీసీయూ మధ్యే ప్రధానమైన పోటీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా చివరిలో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ మద్ధతుని ప్రకటించింది. దీంతో సింగరేణి అంతటా టీబీజీకేఎస్ శ్రేణులు డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో తీర్మానాలు చేశాయి. మొత్తంగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ అధిక ప్రాంతాల్లో విజయం దక్కించుకోవడం గమనార్హం.