ఒకవైపు ఉక్రెయిన్లోని అనేక నగరాల్లో రష్యా సైన్యం విరుచుకుపడుతున్నాయి. దేశంలోని చాలా నగరాలు దాదాపు నేలమట్టమైపోయాయి. యుద్ధం కారణంగా సైనికులు, మామూలు జనాలు లక్షలాది మంది చనిపోయారు. మరికొన్ని లక్షలమంది జనాలు ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోయారు. యుద్ధం కారణంగా యావత్ దేశంలో ఇంత బీభత్సం జరుగుతుంటే రాజధాని కీవ్ లోని ఒక థియేటర్ తెరుచుకున్నది.
థియేటర్ తెరుచుకున్న మొదటిరోజే మూడు ఆటలకు ఫుల్లుగా టికెట్లన్నీ అమ్ముడుపోవటం ఆశ్చర్యంగా ఉంది. కీవ్ లోని ఓ థియేటర్ మూడు నెలల తర్వాత సోమవారమే తెరుచుకున్నది. అయితే ఈ థియేటర్ సినిమా థియేటర్ కాదు. డ్రామాలు ప్రదర్శించే థియేటర్ మాత్రమే. ఎప్పుడైతే థియేటర్ ను యాజమాన్యం తెరుస్తోందని, నాటకం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతోందని తెలియగానే మొదటిరోజు ప్రదర్శించే మూడు ప్రదర్శనల టికెట్లను జనాలు ఎగబడి మరీ కొన్నారు.
యుద్ధం నేపథ్యంలో తాము థియేటర్ తెరవటమే పెద్ద సాహసమని అనుకున్నట్లు యజమాని చెప్పారు. తామే పెద్ద సాహసం చేస్తున్నామని అనుకుంటే జనాలు అంతకన్నా మరింత పెద్ద సాహసం చేసి టికెట్లన్నింటినీ కొనేయటమే కాకుండా థియేటర్ ఫుల్లుగా నిండిపోయినట్లు చెప్పారు. మిగిలిన నగరాలతో పాటు కీవ్ ను కూడా స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యాలు చాలా ప్రయత్నాలే చేశాయి. అయితే రాజధాని కాబట్టి ఇక్కడ ఉక్రెయిన్ సైన్యాలు కూడా ఎక్కువగానే మోహరించున్నాయి.
ప్రతిఘటన ఎక్కువగా ఉండటంతో జనాలను దృష్టిలో పెట్టుకుని రష్యా సైన్యమే వెనక్కి తగ్గింది. కీవ్ చుట్టూ కొన్ని బలగాలను రష్యా మోహరించింది. అయితే సైన్యం మాత్రం కీవ్ లోకి అడుగు పెట్టడం లేదు. దాంతో మిగిలిన దేశంలో పరిస్దితులు ఎలాగున్నా కీవ్ లో మాత్రం వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, షాపింగ్ కాంప్లెక్సులు, థియేటర్లతో జనజీవనం మామూలుగానే ఉంది. అయితే కీవ్ పై రష్యా సైన్యం ఎప్పుడు హఠాత్తుగా విరుచుకుపడతాయో అనే ఆందోళన ఇటు ఉక్రెయిన్ సైన్యంతో పాటు మామూలు జనాల్లో కూడా కనిపిస్తుంది. మరి రష్యన్ సైన్యాలు ఏమి చేస్తాయో చూడాల్సిందే.