టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి గొడవల వ్యవహారం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు ఎవరికి వారు విడిగా తమ వెర్షన్ లు మాట్లాడారు. మరోవైపు, మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు రావడం సంచలనం రేపింది. అయితే, తాను ఆసుపత్రిలో ఉన్నానని, విచారణకు హాజరు కాలేనని, తనకు విచారణ నుంచి కొద్ది రోజులు మినహాయింపు ఇవ్వాలని మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే మోహన్ బాబు పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు..ఆయనకు భారీ ఊరటనిచ్చింది. మోహన్ బాబు దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి మోహన్ బాబుకు మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పోలీసుల ముందు హాజరు నుంచి మోహన్ బాబుకు తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది కోర్టు.
మోహన్ బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. మోహన్ బాబుపై మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు కాకుండా జర్నలిస్ట్‌పై ఆయన దాడిచేసిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, పోలీసుల నోటీసులు అందుకున్న మంచు మనోజ్ నేడు విచారణకు హాజరయ్యారు. మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు కోసం మోహన్‌బాబు తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.
పికెట్ ఏర్పాటు సాధ్యం కాదని కోర్టుకు పోలీసులు తెలిపారు. అయితే, ప్రతి రెండు గంటలకోసారి మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి సమీక్షించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న మోహన్ బాబుకు కోర్టు ఆదేశాలు భారీ రిలీఫ్ ఇచ్చాయి.
కొంతమేరకు ఊరట లభించినట్లైంది.