సాధారణంగా పీఎం, సీఎం స్థాయి ఉన్న వ్యక్తుల ప్రెస్ మీట్లకు, లైవ్ ప్రోగ్రామ్ లకు వీక్షకులు ఎక్కువగా ఉంటారు. ఇక, వారు పాల్గొనే కార్యక్రమాన్ని బట్టి ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. యూట్యూబ్ లో ఆయా కార్యక్రమాలు లైవ్ లో వస్తున్న నేపథ్యంలో వీక్షకులు తమ అభిప్రాయాన్ని లైకులు, డిస్ లైకుల రూపంలో వెంటనే తెలియచేస్తుంటారు. ఇటీవల ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి లైక్ ల కన్నా డిస్ లైకుుల అధికంగా రావడం చర్చనీయాంశమైంది.
ఈ తరహాలోనే ఇపుడు ఏపీ సీఎం జగన్ లైవ్ ప్రోగ్రామ్ కు కూడా రికార్డు స్థాయిలో డిస్ లైకులు రావడంపై చర్చ జరుగుతోంది. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను జగన్ వర్చువల్ విధానంలో విడుదల చేశారు. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అయితే, ఇందులో గ్రూప్-1,2కు సంబంధించి కేవలం 36 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. మిగతా వాటిలో చాలావరకు వైద్యరంగానికి సంబంధించిన ఉద్యోగాలు.
దీంతో, గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న యువత తీవ్రంగా నిరాశ చెందారు. దీంతో, తమ నిరసనను డిస్ లైకుల రూపంలో చూపారు. యువత దెబ్బకు జగన్ లైవ్ కు వెయ్యు లైకులు రాగా…దాదాపు 3 వేల డిస్ లైకులు వచ్చాయి. దీంతో, జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 151 సీట్లు వచ్చాయని జబ్బలు చరుచుకునే సీఎం జగనన్న లైవ్ లో మాట్లాడుతుంటే లైకుల కంటే డిస్ లైకులు ఎక్కువగా రావడం ఏమిటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జగన్ మాయ మాటలను జనం నమ్మడం లేదనడానికి ఈ డిస్ లైకులే నిదర్శనమి చురకలంటిస్తున్నారు.