దేశవ్యాప్తంగా 7 విడతలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో ముగింపు పడనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఏడో విడత పోలింగ్ ముగియనుంది. ఈ క్రమంలోనే సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే గెలుపుపై ఓపక్క అధికార ఎన్డీఏ కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా విజయం తమదే అంటూ ఇండియా కూటమి ఆశా భావం వ్యక్తం చేస్తుంది. మొత్తం 542 లోక్ సభ స్థానాలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనుండగా 400 పైగా స్థానాలు గెలుచుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బీజేపీకి 250 సీట్లు రావడం కూడా కష్టమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విడుదల కాబోతున్న ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి అధికారం చేపడతానని సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖాయం చేసుకోగా వైసిపికి ఘోర పరాభవం తప్పదని ఐపాక్ మాజీ అధినేత ప్రశాంత్ కిషోర్ తో పాటు టిడిపి అధినేత చంద్రబాబు కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ గా మారుతాయా లేదా అన్న విషయం పై మాత్రం ఏ సర్వే సంస్థ 100% గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. గతంలో ఆయా సంస్థలు చేసిన సర్వేల ఫలితాలు, వాస్తవ ఫలితాలను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమైన నేపథ్యంలో ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే గెలుపు తమదంటే తమదంటూ ఆయా పార్టీల నేతలు కోట్ల రూపాయల బెట్టింగ్లు వేస్తున్నారు.