గతాన్ని పక్కన పెడితే.. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. పార్టీ ఏదైనప్పటికీ ఎన్టీఆర్ మీద అభిమానం మాత్రం కామన్ గా మారిన పరిస్థితి. తెలుగోడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. దేశ రాజకీయాల్ని సైతం శాసించినట్లుగా చంద్రబాబుకు పేరు ఉన్న రోజుల్లోనూ ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కార ప్రకటన వెలువడని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి కారణం కేంద్రంలో మోడీ సర్కారు ఉండటం.. ఆ ప్రభుత్వంలో టీడీపీ కీలక మిత్రపక్షంగా మారిన నేపథ్యంలో.. ఏళ్లకు ఏళ్లు పెండింగ్ లో ఉన్న ఇష్యూను ఈ జనవరి 26 సందర్భంగా ప్రకటించే పురస్కారాల్లోనే ఎన్టీవోడికి భారతరత్నను ప్రకటిస్తారా? అన్న చర్చ నడుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తన తల్లి భువనేశ్వరితో కలిసి వచ్చిన లోకేశ్.. తన తాతకు నివాళులు అర్పించారు. నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఒక ప్రభంజనంతో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని.. అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీలో కోటి మంది సభ్యత్వాలు తీసుకోవటం గర్వకారణంగా చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ అన్నది పేరు కాదని.. అదో ప్రభంజనంగా పేర్కొన్న లోకేశ్.. ‘‘ఆయనకు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తాం. విశాఖ ఉక్కును కాపాడుకుంటున్నాం. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు’ అని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవానికి ముందుగా లోకేశ్ నోటి నుంచి వచ్చిన మాటలతో ఎన్టీఆర్ కు ఈసారైనా భారతరత్న పురస్కారాన్ని ప్రకటిస్తారా? అన్న ఆశలు కలుగుతున్న పరిస్థితి. మరి.. మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.