ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర చర్చగా మారారు. నిజానికి ఆయన చేసే పనులన్నీ కొత్త తరహా గా కనిపించడం.. వ్యక్తిగత విషయాల్లోనూ మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించటం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. తాను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ముగింపు పలికేందుకు తిరుమలకు వచ్చిన పవన్.. తన కుమార్తెలతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లడం తెలిసిందే.
తన భార్య అన్నా అన్న మతానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆమెతో తనకు కలిగిన సంతానం స్వామి వారిని దర్శించుకోవాల్సిన వేళలో.. తనకు తానే డిక్లరేషన్ ను ఇచ్చి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అనూహ్య సన్నివేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా చూశారు. మొదటిసారి తన ఇద్దరు కూతుళ్లను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు. విడిగా వారిద్దరు కలిసే ఉండొచ్చు. కానీ.. పబ్లిక్ గా మాత్రం చూసింది ఈ సందర్భంలోనే.
అచ్చుగుద్దినట్లుగా ఇద్దరు ఒకేలా ఉండటం.. ఒకే డ్రెస్ (దాదాపుగా) ధరించటం.. ఇద్దరిలోనూ పవన్ కల్యాణ్ పోలికలే ఎక్కువగా కనిపించటం అందరినీ ఆకట్టుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చాలామందికి పవన్ కు ఎంతమంది పిల్లలు? అన్న సందేహం కలిగింది. దీంతో.. తమ వాట్సాప్ గ్రూపుల్లోనూ.. గూగుల్ లోనూ వెతకటం కనిపించింది. ఈ సందర్భంగా పవన్ ఫ్యామిలీ ట్రీను మరోసారి వైరల్ అయ్యింది.
పవన్ ను అభిమానించి.. ఆరాధించే వారికి పవన్ పిల్లల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వారందరికీ ఆ ఆసక్తిని కలిగించేలా చేసింది పవన్ తాజా తిరుమల దీక్ష. ఆయనకు మూడు పెళ్లిళ్లు అయితే.. రెండు.. మూడో పెళ్లిళ్లతోనే సంతానం ఉంది. రెండో భార్య రేణు దేశాయ్ తో ఇద్దరు సంతానం (అకీరా నందన్, ఆధ్యా) మూడో భార్య అన్నా లెజినోవాతో ఇద్దరు సంతానం (మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజనా పవనోవా).
ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో పవన్ వెంటే ఆయన పెద్ద కుమారుడు అకీరా నందన్ ఉండటం ఆసక్తికరంగా చెప్పాలి. ఆ తర్వాత రెండు మూడు కార్యక్రమాల్లో పెద్ద కుమార్తె ఆధ్యాతో కనిపించారు. తాజాగా మాత్రం తన ఇద్దరు కుమార్తెలు ఆధ్యా.. అంజనాతో కనిపించటంతో పవన్ పిల్లల వివరాల మీద ఆసక్తి వ్యక్తమైంది.