కాలం మారింది. అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంతో తమ ఇమేజ్ ను పెంచుకోవటానికి నటీనటులు.. క్రీడాకారులు.. సెలబ్రిటీలు చేసే చేష్టలు అన్ని ఇన్ని కావు. మొత్తంగా తమను ప్రజలు ఆదరించాలని.. అభిమానించాలన్న ఆకాంక్ష వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు.
సెలబ్రిటీలను సామాన్యులు ఎంత శ్రద్ధను చూపుతారో.. వారి ఇష్టాయిష్టాల్ని తెలుసుకోవటంలో ఆసక్తిని చూపటంతో పాటు.. వాటిని ఫాలో అయ్యేందుకు వెనుకాడరు. అందుకే.. నటీనటులు కావొచ్చు.. సెలబ్రిటీలు కావొచ్చు.. ప్రముఖులు ఎవరైనా సరే బాధ్యతగా వ్యవహరించాలని కోరేది. ఎందుకంటే వారు సమాజం మీద చూపించే ప్రభావం ఇంతా అంతా కాదు.
ఇదంతా ఎందుకంటే.. సెలబ్రిటీలకు సంబంధించిన అంశాల్ని ఎంత జాగ్రత్తగా.. సూక్ష్మంగా గమనిస్తారన్న దానికి తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం అందరిని ఆకర్షిస్తోంది. మిస్ యూనివర్స్ గా ఎంపికై.. అనంతరం నటనతో.. తన అందంతో కోట్లాది మంది మనసుల్ని దోచేసిన లారాదత్తా.. తాజాగా ఒక వెబ్ సీరిస్ లో పని చేసింది. హిక్కాప్స్ అండ్ హుక్కాప్స్ పేరుతో లయన్స్ గేట్ ఇండియా సంస్థ దీన్ని నిర్మించింది. దీనికి సంబంధించిన ప్రమోషన్ ప్రోగ్రాంలో పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన తాజా ఫోటోను ఒక నటుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై ఒక నెటిజన్ రోటీన్ కు భిన్నంగా స్పందించారు. లారాదత్తా ఫోన్ కేస్ గురించి ప్రస్తావిస్తూ.. తాను పేదవాడిని కాబట్టి ఫోన్ కవర్ ను మార్చలేదని.. కానీ లారాదత్తా మాత్రం రెండేళ్లుగా అదే ఫోన్ కేస్ ను వాడుతుందని పేర్కొన్నారు.అతడి కామెంట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
దీనికి లారాదత్తా కూడా స్పందించింది. సదరు సామాన్యుడి పరిశీలనలో నిజం ఉందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. తాను రెండేళ్లుగా ఫోన్ కవర్ మార్చలేదని చెప్పింది. కొన్ని వస్తువులకు సెంటిమెంట్ ఉంటుదంటూ తనకున్న ఎమోషన్ పార్ట్ ను బయటపెట్టింది.
ఇదంతా చూసినప్పుడు.. ప్రముఖులను సామాన్యులు ఎంతలా ఫాలో అవుతారు.. వారి ప్రభావంఎంత ఉంటుందన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అందుకే.. సెలబ్రిటీలు వీలైనంతవరకు వాణిజ్య కోణంలో కాకుండా.. సామాజిక కోణంలోనూ కాస్తంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.