టీడీపీ అధినేత, ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు సమర్థతకు మరోసారి పరీక్షా కాలం మొదలైందా? ఆయన వేసే అడుగులు.. తీసుకునే నిర్ణయాలపై అందరూ ప్రత్యేకంగా దృష్టి పెట్టారా? ఆయనవైపు చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న పొలిటికల్ పెద్ద దిక్కు.. చంద్రబాబే! ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఒప్పుకొంటున్న మాట.
ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకి వచ్చిన జగన్.. చేస్తున్న దుబారా.. సంక్షేమ పథకాల పంపకాలు వంటి వాటి తో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. దీని నుంచి బయట పడడం మాట అటుంచితే.. రాబోయే మూడేళ్లలో రాష్ట్రానికి సంబంధించి ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయోనని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
సాధారణంగా.. రాజకీయాల్లో వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు.. పార్టీలు, నేతలపై ప్రభావం చూపించేలా ఉంటాయి. కానీ, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం భ్రష్టు పడుతోందనే ఆవేదన, ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. ఒకవైపు అప్పులు చేస్తూ.. మరో వైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీళ్ల విషయంలో జగన్ వ్యవహార శైలి తీవ్ర ఇబ్బందికరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి.
మరీ ముఖ్యంగా మూడు రాజధానుల పేరిట ఆయన ఎంచుకున్న వ్యూహం బెడిసి కొట్టినా.. ఆయన తెలుసుకోలేక పోతున్నారు. అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే.. ఇప్పటికే పెట్టుబడులు వచ్చేవి. అదేసమయంలో హోదా కోసం ఉద్యమం చేస్తున్నామని ..చెబుతున్నా.. అది ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కిఅన్నచందంగా మారిపోయింది.
కేంద్రాన్ని ఒప్పించి.. మెప్పించే శక్తి జగన్‌కు లేదనే విషయం.. జాతీయస్థాయిలో వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. విశాఖ ఉక్కు వంటి కీలక ప్రాజెక్టును కేంద్ర ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ.. జగన్ నిమ్మకు నీరెత్తినట్టు లేఖలతో సరిపెడు తుండడం కూడా సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితి వస్తుందని.. రాష్ట్రం అన్ని విధాలా భ్రష్టు పడు తుందని.. బహుశ.. ఎవరూ ఊహించి ఉండరు.
ఈ క్రమంలోనే ఇప్పుడు అధికారంలో లేక పోయినా.. అందరూ చంద్రబాబు వైపు చూస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడవేసే..ఫార్ములా ఏదైనా ఆయన చెప్పకపోతారా? అని చర్చలు జరుగుతుండడం గమనార్హం. అధికారంలో లేకపోయినా.. చంద్రబాబు ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. వ్యూహకర్తగా, విజన్ ఉన్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు ఉద్యమమే చేస్తారో.. లేక ఆందోళన బాట పడతారో.. ఏం చేసినా.. రాష్ట్రం కోసం ఆయన ముందుకు రావాలనే డిమాండ్ వినిపిస్తుండడం గమనార్హం. అయితే.. చంద్రబాబు ముందు అనేక సవాళ్లు కనిపిస్తున్నా యి. ఆయన ఏం చేయాలన్నా.. పార్టీ నేతలు కలిసి రావాలి. అదేసమయంలో సీనియర్లు సహకరించాలి.
ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మంది సీనియర్లు..ఎవరికి వారుగా వ్యవహరించడం.. సమస్యలపై పట్టు సాధించలేక పోవడం.. పైపై విమర్శలతో పొద్దు పుచ్చడం.. వంటివి టీడీపీకి ఇబ్బందిగా మారాయని చెప్పకతప్పదు. మరి వీటన్నింటినీ అత్యంత వేగంగా సరిదిద్దుకుని ముందు కు సాగితే.. చంద్రబాబుకు మళ్లీ ఏపీ ప్రజలు ఫిదా కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.