- నాడు బీవోవోటీ ఒప్పందం
- 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికే దక్కాలి
- 14 ఏళ్లకే అదానీకి సొంతం
- సొంత వాటాకూ సర్కారు మంగళం
- ప్రైవేటుకు ఇవ్వడానికి
- నాడు రక్షణ శాఖ ససేమిరా
- రాష్ట్రప్రభుత్వ వాటా ఉన్నందునే కేంద్రం సమ్మతి
- ఇప్పుడు పూర్తిగా ప్రైవేటుకే
- వాటాల విక్రయం చెల్లదంటున్న నిపుణులు
రాష్ట్రప్రభుత్వానికి చెందిన గంగవరం పోర్టును జగన్ సర్కారు అప్పనంగా అదానీ కంపెనీకి అప్పగించబోతోంది. రాష్ట్ర ఆస్తులను గుజరాత కంపెనీలకు ధారాదత్తం చేసి.. కేసుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్రెడ్డి ఇందుకు లైన్ క్లియర్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే లీజుకిచ్చిన భూమిని వేరొకరికి విక్రయించే అవకాశం ఎవరికైనా ఉంటుందా అనేదే ఇక్కడ ప్రశ్న. వాస్తవానికి.. వారు కాకపోతే వీరు.. వీరు కాకుంటే ఇంకెవరో వచ్చి కొనుక్కోవడానికి గంగవరం పోర్టు ఎవరి సొంతమూ కాదు. అది 30 ఏళ్లు మాత్రమే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండాలి. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వానికే దక్కాలి.
పోర్టు ఏర్పాటు సమయంలో కుదిరిన ఒప్పందమిది. దీనినే బిల్ట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోవోటీ) ఒప్పందమని అంటారు. 2002లో ఈ పోర్టు ఏర్పాటుచేసిన డీవీఎస్ రాజుకు, రాష్ట్రప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. లీజు కాలం 30 ఏళ్లు. అంటే పోర్టును నిర్మించి, నిర్వహించి.. లీజు కాలపరిమితి ముగియగానే రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలన్న మాట.
ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం అంగీకరిస్తే పదేళ్ల చొప్పున రెండు సార్లు లీజుకాలం పొడిగించవచ్చు. అనంతరమైనా కచ్చితంగా ప్రభుత్వానికి అప్పగించి వెళ్లాల్సిందే. ఇప్పుడు జగన్ ప్రభుత్వం, అదానీ కంపెనీ దీనిని గందరగోళం చేసేశాయి.
ఇంకా 16 ఏళ్లు ఉండగానే..
పోర్టు నిర్మాణానికి 2002లో కేంద్రం అనుమతి ఇచ్చింది. గంగవరం, దిబ్బపాలెం పరిసరాల్లోని మత్స్యకారులు తమ భూములిచ్చేందుకు ససేమిరా అన్నారు. 2006లో నాటి వైఎస్ ప్రభుత్వం.. వారిపై కాల్పులు జరిపించి మరీ భూసేకరణ చేసింది.
మరుసటి ఏడాది పోర్టుకు భూములు అప్పగించారు. అంటే ఇప్పటికి 14 ఏళ్లు గడిచాయి. ఇంకా 16 ఏళ్లు మిగిలి ఉంది. బీవోవోటీ ఒప్పంద కాలపరిమితి ముగియగానే డీవీఎస్ రాజు దానిని ప్రభుత్వానికి అప్పగించి వెళ్లిపోవాలి. అప్పుడే మొత్తం 100 శాతం వాటా సర్కారుకు వస్తుంది. కానీ లీజు కాలపరిమితి సగమైనా పూర్తికాకముందే పోర్టు అదానీ గ్రూపు హస్తగతమైంది.
డీవీఎస్ రాజు తన వాటాగా వచ్చిన 58.1 శాతం వాటాను గత మార్చిలో దానికి రూ.3,604 కోట్లకు విక్రయించారు. అదే పోర్టులో 31.5 శాతం వాటా ఉన్న దుబాయ్ కంపెనీ కూడా తన షేర్‌ను రూ.1,954 కోట్లకు అమ్మేసింది. రాష్ట్రప్రభుత్వంగా తన వాటాగా వచ్చిన 10.39 శాతాన్ని కేవలం రూ.645 కోట్లకు అదానీకి విక్రయించడానికి అంగీకరించింది.
దీనికి ఆమోదముద్ర వేయడానికి ఓ కమిటీని కూడా నియమించింది. ఎవరికో చెందిన ఇల్లు/స్థలాన్ని లీజుకు తీసుకుని.. దానిని ఇంకెవరికో అమ్మడం కుదరనే కుదరదు. గంగవరం పోర్టుకూ ఇది వర్తిస్తుంది.
ఇచ్చింది లీజుకే..
పోర్టుకు ప్రభుత్వం 1,800 ఎకరాలను లీజుకు మాత్రమే ఇచ్చింది. అందులో అది కూడా జాయింట్ వెంచర్ భాగస్వామి. అలాంటి సంస్థలో వాటాను ఒకరికి తెలియకుండా మరొకరు అమ్మేసుకోవడం కుదరదు. అయినా సరే.. డీవీఎస్ రాజు, దుబాయ్ కంపెనీల వాటాలను అదానీ కొనేసింది.
ప్రభుత్వం కూడా తన వాటాను విక్రయిస్తోంది. 16 ఏళ్ల తర్వాత పూర్తిగా తనకు దక్కాల్సిన పోర్టును తానే ఎలా వదులుకుంటుంది? దీని మర్మమేమిటి? సంబంధిత జీవోలో.. ‘మిగిలిన కాలానికి ఒప్పందంలోని అంశాలన్నీ యథాతథంగా వర్తిస్తాయి’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో స్పష్టత ఇవ్వలేదు.
బీవోవోటీ గురించిన ప్రస్తావనే లేదు. గంగవరం పోర్టు వెనుక పెద్ద చరిత్రే ఉంది. విశాఖపట్నం రక్షణపరంగా అత్యంత కీలకనగరం. తూర్పు నౌకాదళానికి ఇదే ప్రధాన స్థావరం. ఈ నేపథ్యంలో పోర్టు ఏర్పాటుకు రక్షణ శాఖ తొలుత అంగీకరించలేదు. వ్యూహాత్మక తీరంలో ప్రైవేటు పోర్టు పెట్టడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పింది.
ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో అక్కడ ఏం జరుగుతోందో, ఎవరికి బాధ్యత ఉంటుందో తెలియదని పేర్కొంది. అయితే నాటి సీఎం రాజశేఖరరెడ్డి కేంద్రంలో తనకున్న పరపతినంతా ఉపయోగించి.. రక్షణపరంగా సమస్యలేవీ రావని హామీ ఇచ్చారు. జాయింట్ వెంచర్‌కు సంబంధించిన పత్రాలన్నీ ఇచ్చాకే కేంద్రం షరతులతో అనుమతులు మంజూరుచేసింది.
ఇప్పుడు దీనిని పూర్తిగా ప్రైవేటుపరం చేసి ప్రభుత్వం తప్పుకోవడం కేంద్రం ఇచ్చిన అనుమతులకు వ్యతిరేకం. అందువల్ల పోర్టు విక్రయం చెల్లదు. ఎవరైనా కోర్టుకెళ్తే ఇదంతా తేలుతుంది.కానీ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన అదానీకి వ్యతిరేకంగా కేంద్రం ఈ మాట చెప్పడం సందేహమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇప్పుడు న్యాయ సలహా తీసుకుంటారట!
ఇల్లు మొత్తం కట్టేశాక… ‘ప్లాన్’ కోసం ఇంజనీరు వద్దకు వెళ్లినట్లుగా.. పోర్టులో రాష్ట్ర వాటా విక్రయంపై ఇప్పుడు న్యాయ సలహా తీసుకుంటామని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.
పోర్టులో ప్రభుత్వ వాటాను విక్రయించాలని రాష్ట్ర మంత్రివర్గమే తీర్మానించింది. ఇప్పుడు… దీనిపై న్యాయసలహా తీసుకోవడమేంటి? కేబినెట్ నిర్ణయమంటే… ఆషామాషీ కాదు! అది దాదాపుగా చట్టంతో సమానం. కేబినెట్ ముందు పెట్టకముందే అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తారు.
న్యాయ సలహాలు కూడా తీసుకున్నాకే మంత్రివర్గం తీర్మానం చేస్తుంది. కానీ గంగవరం పోర్టులో వాటాల అమ్మకం విషయంలో మాత్రం, తీర్మానం చేసేసిన తర్వాత న్యాయ సలహా తీసుకుంటామని చెబుతుండడం గమనార్హం. పైగా పోర్టుకు ఇచ్చిన 1,800 ఎకరాల విలువ కనీసం రూ.9వేల కోట్లు అవుతుందని అంచనా.
అయినా రాష్ట్రప్రభుత్వం కేవలం రూ.645 కోట్లు పుచ్చుకుని.. అంత విలువైన వాటా వదులుకోవడానికి సిద్ధపడడంలో మతలబు ఏమిటో?
2015 నుంచి అదానీ యత్నాలు
ఆంధ్రప్రదేశలో పోర్టులను హస్తగతం చేసుకోవడానికి అదానీ గ్రూపు 2015 నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అప్పట్లో వారి ఆటలు సాగలేదు. గంగవరం పోర్టులో మేజరు వాటా కలిగిన డీవీఎస్ రాజు కూడా తన వాటా విక్రయించడానికి విముఖత చూపారు.
జగన్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. తప్పనిసరి స్థితిలో అదానీ చెప్పిన ధరకే డీవీఎస్ రాజు తన వాటా వదులుకున్నారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం కూడా అదే చేస్తోంది.
గంగవరం పోర్టుకు ఏడాదికి రూ.500 కోట్ల లాభం వస్తోంది. అటువంటి పోర్టులో వాటాను అమ్ముకోవలసిన అవసరం లేదు. పైగా ఇది జాయింట్ వెంచర్ కాబట్టి, ఆ మేరకే కేంద్రం పోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చినందున తప్పనిసరిగా అందులో ఏపీ ప్రభుత్వం కొనసాగాల్సి ఉంది.
ఏటా ఆదాయంతోపాటు లాభాలు సమకూర్చే పోర్టు వాటాను అమ్మడాన్ని బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకు తిన్నట్లేనని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ స్పష్టం చేశారు.