పవన్ కళ్యాణ్ తన చేతిలో మూడు సినిమాలను హోల్డ్‌లో పెట్టేసి గత ఏడాది రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఎన్నికలు అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాడు. మళ్లీ ఆయన కెమెరా ముందుకు రావడానికి చాలా టైమే పట్టింది. మళ్లీ అందుబాటులోకి వచ్చాక ముందుగా హరిహర వీరమల్లునే టేకప్ చేశాడు. అయినా అది ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఓజీ కోసం కూడా పవన్ డేట్లు సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హరిహర వీరమల్లు మే9న రిలీజ్ అయితే ఓజీ ఏడాది చివర్లో అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంటుంది. ఐతే ఈ రెండు చిత్రాల గురించే చర్చ జరుగుతోంది తప్ప.. మూడో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాత్రం ఊసే వినిపించడం లేదు. ఈ సినిమా పక్కకు వెళ్లిపోవడంతో దర్శకుడు హరీష్ శంకర్ ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ చేశాడు. ఇంకో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. నిర్మాతలు సైతం వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి.. అది అటకెక్కేసినట్లేనా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఇలాంటి టైంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రిలీజైతే ఏ పాన్ ఇండియా సినిమా కూడా సరిపోనంత హైప్ వస్తుందని రవిశంకర్ వ్యాఖ్యానించడం విశేషం. ఈ సినిమా మామూలుగా ఉండదని చెప్పిన రవిశంకర్.. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా స్క్రిప్టు లాక్ చేసి పెట్టాడని తెలిపారు. వచ్చే ఏడాది ఈ సినిమాతో ప్రేక్షకులను కలుస్తామని రవిశంకర్ అన్నాడు. బహుశా ఈ ఏడాది ఓజీని కూడా పూర్తి చేసేస్తే.. ఆ వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్‌ను పట్టాలెక్కిద్దామని మేకర్స్ భావిస్తుండొచ్చు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో అయినా ఈ సినిమా విడుదలవుతుందేమో చూడాలి. ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ మాట్లాడ్డం పవన్ అభిమానులకు బాగానే ఉత్సాహాన్నిస్తోంది.