మన తెలుగు వాడు.. అందునా.. రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక అభిమానం చూపించేవాడు.. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు ఘోర అవమానం జరిగింది. ప్రస్తుతం ఆయన శీతల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా ఉన్నారు. అయితే.. ఆయనకు ఆ రాష్ట్రంలో తీవ్ర అవమానం.. జరిగింది. విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘెరావ్ చేయడంతోపాటు.. గవర్నర్ దత్తాత్రేయను లాగి పడేశారు. ఈ ఘటనలో ఆయన కింద పడిపోయారు. దీనిపై అధికార పక్షం నిప్పులు చెరిగింది. వెంటనే సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్సెండ్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
విషయం ఏంటంటే..
శుక్రవారం నుంచి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తొలిరోజు సభ ను ఉద్దేశించి గవర్నర్ దత్తాత్రేయ ప్రసంగించారు. ఉదయం 11 గంటలకే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెనువెంటనే విపక్ష కాంగ్రెస్ నేతలు ఒక్కపెట్టున ఆందోళనకు దిగారు. విపక్ష నేత అగ్నిహోత్రి తన సీట్లోంచి లేచి నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితుల మధ్య గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైను మాత్రమే చదవి వినిపించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, స్పీకర్ విపిన్ పార్మర్తో కలిసి బయటకు వస్తుండగా స్పీకర్ ఛాంబర్ వద్ద గవర్నర్ను నిలువరించేందుకు విపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది.
కిందకు లాగేయడంతో..
ఈ తోపులాటలో గవర్నర్ దత్తాత్రేయను కాంగ్రెస్ సభ్యుడు ఒకరు చేయి పట్టుకుని కిందకు లాగేశారు. దీంతో ఆయన ఒక్కసారిగా కిందపడ్డారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే స్పందించిన స్పీకర్.. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రాకుండా వారిని సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రితో పాటు ఎమ్మెల్యేలు హర్ష వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజడ, వినయ్ కుమార్ ఉన్నారు.
మళ్లీ రెచ్చిపోయిన నేతలు
సభ తిరిగి సమావేశం కాగానే, గవర్నర్ను ఘెరావ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ చెందడాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందని అన్నారు. అనంతరం, ఐదుగురు ఎమ్మెల్యేలను తక్కిన బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ విపిన్ పార్మర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నివేదిక కూడా కోరింది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కాగా, ఇటీవలే.. దత్తాత్రేయ.. అన్ని పార్టీల సభ్యులకు హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సాన్ని పురస్కరించుకుని భారీ విందు ఇవ్వడం గమనార్హం.