టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వరుస కేసులు పెట్టిన విషయం తెలిసిందే. దీనిలో ఇప్పటికే స్కిల్ కార్పొరేషన్ లో అవినీతికి పాల్పడ్డారంటూ.. ఆయనపై కేసు పెట్టడం.. ఆవెంటనే ఆయనను జైలుకు తరలించడం కూడా తెలిసిందే. దీనిలో 52 రోజలు తర్వాత.. మధ్యంతర బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. తాజాగా.. వారం కిందట ఇదే కేసులో రెగ్యులర్బెయిల్ కూడా మంజూరైంది.
ఇదిలావుంటే.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన మరోకేసు.. ఇన్నర్‌రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని. అయితే.. ఈ కేసులో చంద్రబాబును ఇంకా విచారణకు పిలవలేదు. అయితే.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ.. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై ఎలాంటి తొందర పాటు చర్యలూ తీసుకోవదని తాజాగా శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం ఈ కేసును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. దీంతో చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించినట్టయింది. కాగా, చంద్రబాబు హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను పదేపదే మార్చారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలా అలైన్‌మెంట్‌ను పదేపదే మార్చడంతో టీడీపీలో ఉన్న నాయకులు, అప్పటి మంత్రులు, స్వయంగా చంద్రబాబుకు చెందిన సంస్థ లబ్ధి పొందాయని ప్రభుత్వ వాదన.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న భూముల ధరలను పెంచుకునేందుకు ఇలా మార్పులు చేశారని.. ఇది నేర పూరిత కుట్రేనన్నది ప్రభుత్వ వాదన. ఈ కేసులోపూర్తి స్థాయి విచారణను హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేస్తూ.. ఎలాంటితొందరపాటు చర్యలూ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.