కొద్ది నెలల క్రితం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకం వ్యవహారం మాజీ సీఎం కేసీఆర్ వర్సెస్ తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్న రీతిలో చాలా కాలం నడిచిన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, అలీ ఖాన్ లను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. ఆ ఇద్దరి నియామకాన్ని తమిళిసై ఆమోదించారు కూడా. ఇక, ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో తాజాగా తెలంగాణ హైకోర్టు..రేవంత్ రెడ్డి సర్కార్ కు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంపై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా కేసీఆర్ సర్కార్ సిఫారసు చేయగా తమిళిసై తిరస్కరించారు. దీంతో, వారిద్దరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసిందని వివరించారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్ కు లేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ కొనసాగుతుండగానే ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేయడం, దానికి వెంటనే తమిళిసౌ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి.
అయితే, హైకోర్టులో తమ పిటిషన్ పెండింగ్లో ఉండగానే వారి సిఫారసును ఆమోదించడంపై శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జరిగే వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా తమిళిసై తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపే వీలులేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరఫు న్యాయవాదులు తీసుకువెళ్లారు. దీంతో, మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు సూచించింది.
కొత్తగా మరోసారి ఎమ్మెల్సీల నియామకాన్ని చేపట్టాలని రేవంత్ సర్కార్ కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేబినెట్ బేటీ నిర్ణయం తీసుకోవాలని, దానిని గవర్నర్ కు పంపించాలని ఆదేశించింది. ఇక, మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని కూడా తెలంగాణ హైకోర్టు సూచించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం చెల్లదు అంటూ తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కార్ కు షాక్ తగిలినట్లయింది. మరి ఈ వ్యవహారం పై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.