విధానాల్ని మార్చటం తప్పేం కాదు. కానీ.. అలా చేసేటప్పుడు అప్పటికే అమలవుతున్న విధానాల కంటే మెరుగైనవి.. లోపాలు లేనివి.. వేలెత్తి చూపించే అవకాశం లేని విధంగా కొత్తవి ఉండాలి. అంతే తప్పించి.. మనం అనుకున్నాం.. జరిగిపోవాలంతే అన్నట్లుగా ఉంటేనే ఇబ్బంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన ధరణి వెబ్ పోర్టల్ విషయంలో అలాంటి పరిస్థితే ఉంది. భూమి.. ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న విధానంలో కొన్ని లోపాలు ఉండటాన్ని ఒప్పుకోవాల్సిందే.
వాటిని సరి చేసే క్రమంలో మరిన్ని తప్పులు దొర్లకూడదు కదా? మరింత కన్ఫ్యూజన్ కు అవకాశం ఇవ్వకూడదు కదా? అంతేకాదు.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని సవాలు చేసేలా అధికారిక నిర్ణయాలు ఉండకూడదు కదా? అన్నది మరో ప్రశ్న. తాజాగా ధరణిపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర హైకోర్టు ఇవే అంశాల్ని ప్రస్తావించింది.
ధరణిలో నమోదు చేసుకోకుంటే ఆస్తి బదలాయింపు జరగదని ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగం కల్పించిన ఆస్తిహక్కును ఉల్లంఘించినట్లు అవుతుందన్న ప్రశ్నను సంధించింది. ధరణి వెబ్ పోర్టల్ లో వివరాల్ని నమోదు చేసేందుకు ఆధార్.. కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాల్ని కోరటాన్ని న్యాయవాదులు పలువురు వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది.
వైట్ హౌస్.. బకింగ్ హమ్ ప్యాలెస్ ల డేటానే హ్యాక్ చేశారని.. డేటా దుర్వినియోగం జరిగితే ఎవరు బాద్యత వహిస్తారని ప్రశ్నించింది. వ్యవసాయేతర ఆస్తుల్ని ధరణి వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోకపోతే.. క్రయ.. విక్రయాల అవకాశం ఉండదని పత్రికా ముఖంగా ప్రకటనలు చేశారని.. దీనిపై ప్రజల్లో సందేహాలు కలుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. వీటిని తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని పేర్కొంది.
సేకరించిన డేటా లీక్ అయితే.. గోప్యత హక్కుకు భంగం వాటిల్లదా? ప్రజలకు ఉన్న రక్షణ ఏమిటి? ఇలాంటి అంశాలపై చట్టంలో ఎక్కడా పేర్కొనలేదన్నారు.
వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుకు ఆధార్ తో పాటు.. కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాలని ఒత్తిడి చేయరాదన్న మధ్యంతర ఆదేశాల్ని డిసెంబరు 3 వరకు హైకోర్టు పొడిగించింది. దీనిపై తదుపరి విచారణ ఆ రోజున (డిసెంబరు మూడున) నిర్వహిస్తారు.