ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఘోర పరాజయాన్ని అందించిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాల్లో మాత్రమే పార్టీ విజయం దక్కించుకుంది. దీంతో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీపడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కనుమరుగైంది. దీనిని ఇవ్వాలని జగన్.. ప్రజలే ఇవ్వంది తామెలా ఇస్తామని.. అధికార పక్షం వాదనకు దిగిన విషయం తెలిసిందే. ఇక, దీనిపై స్పీకర్ కు లేఖ రాసినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో వైసీపీ అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లో పలు అంశాలను.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉటంకించారు. ఈ పిటిషన్ తాజాగా మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఏవైనా రూల్స్ ఉన్నాయా? అని ప్రశ్నించింది.
ఏయే సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను తిరస్కరిస్తారు? ఇస్తారు? అనే విషయంపై వివరణ కూడా ఇవ్వాలని కోరింది. అలానే.. అసలు సభా పతి ఏయే రూల్స్ ప్రకారం నడుచుకుంటారు? ఏయే రూల్స్ ప్రకారం.. ప్రధాన ప్రతిపక్షంగా ఒక పార్టీని గుర్తిస్తారు? వంటివివరాలను కూడా తమకు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలానే జగన్ స్పీకర్‌కు రాసిన లేఖను కూడా తమకు సమర్పించాలని.. దీనిని అకనాలెడ్జ్ చేశారా? లేదా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎలాంటి వాద ప్రతివాదాలకు అవకాశం లేకుండా.. స్పీకర్ పక్షాన తమకు అఫిడవిట్ దాఖలు చేయాలని మాత్రమే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చేందుకు నిర్దేశిత నియమాలు అంటూ.. అటు రాజ్యాంగంలోకానీ.. ఇటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోకానీ లేవు. ఈ క్రమంలో స్పీకర్ ఏం చెబుతారనేది చూడాలి.